అమరావతి : గొడ్డలి పార్టీ అధినేత వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి వ్యవసాయ, ఆక్వా, పొగాకు సమస్యలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో వ్యవసాయ, నీటిపారుదల రంగాలను పూర్తిగా నిర్వీర్యం చేసిన వ్యక్తి ఇప్పుడు రైతుల పేరుతో రాజకీయాలు చేయడం విడ్డూరమని వ్యాఖ్యానించారు. పొగాకు రైతుల సమావేశాల పేరుతో నిజమైన రైతులను కాకుండా వైసీపీ కార్యకర్తలకు కండువాలు కప్పి రైతులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. భీమవరంలో జరిగిన ఆక్వా రైతుల ముఖాముఖి కార్యక్రమంలో కూడా డబ్బులు ఇచ్చి మహిళలు, వృద్ధులను తీసుకొచ్చి రైతుల సమావేశంగా ప్రచారం చేశారని విమర్శించారు. శ్రీకాకుళం జిల్లాలో ఇటీవల జరిగిన రెండు ఘటనలను ప్రస్తావించిన మంత్రి, మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కుమారుడికి సంబంధించిన రోడ్డు ప్రమాదం కేసులో నిజానిజాలు వెలుగులోకి రావాల్సి ఉందని, ప్రభుత్వం చట్ట ప్రకారం చర్యలు తీసుకుందని తెలిపారు.
అలాగే మాజీ శాసన సభాపతి తమ్మినేని సీతారాం భూ ఆక్రమణ ఆరోపణలపైనా చట్టబద్ధ చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కొందరు నాయకులు రైతుల నుంచి తక్కువ ధరలకు భూములు కొనుగోలు చేసి, రియల్ ఎస్టేట్ పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. బాధితులను కాకుండా తప్పుచేసిన వారిని పరామర్శల పేరుతో ధర్మాన సోదరులు ర్యాలీలు చేయడం విడ్డురంగా ఉందన్నారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చట్టం ముందు సమానమేనని, ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తాను ప్రభుత్వ భూములకు కాపలాదారుడిగా వ్యవహరిస్తానని, నిజాయితీగా పని చేసినందుకే గతంలో ఎదురైన ఇబ్బందులను ఎదుర్కొని నిర్దోషిగా బయటకు వచ్చానని మంత్రి పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీలో తప్పు చేసిన వారు సొంత కార్యకర్తలైనా చర్యలు తప్పవని, గుంటూరులో మహిళపై దాడి చేసిన టీడీపీ కార్యకర్తను అరెస్ట్ చేయడంతో పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేశామని గుర్తు చేశారు. అయితే వైసీపీలో మాత్రం తప్పు చేసిన వారికి పదవులు ఇవ్వడం జరుగుతోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు రాజకీయాల పేరుతో మోసపోకుండా వాస్తవాలను గుర్తించాలని, అభివృద్ధి, రైతు సంక్షేమం కోసం పనిచేస్తున్న ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.

















