విద్యుత్ స్తంభాల త‌యారీలో రాజీ ప‌డొద్దు

ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి

hellotelugu-KarnatiVarunReddy

హైద‌రాబాద్ : విద్యుత్ స్తంభాల తయారీ నాణ్యత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థ బలోపేతానికి , వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడానికి విద్యుత్ స్తంభాల నాణ్యత అత్యంత కీలకమని అన్నారు. వరంగల్ పున్నెల్ రోడ్ లోని స్వర్ణ , ఉజ్వల స్థంబాల తయారీ కేంద్రలతో పాటు , బిబి నగర్ గూడూరులోని మంచుకొండ స్థంబాల తయారీ కేంద్రాలలో క్షేత్రస్థాయిలో సందర్శించి, తయారీ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా స్తంభాల తయారీలో వాడే సిమెంట్, ఇసుక, కంకర మిశ్రమ నిష్పత్తిని తనిఖీ చేశారు. నిర్ణీత ప్రమాణాల ప్రకారమే మిక్సింగ్ జరుగుతుందో లేదో పరిశీలించారు.

నిబంధనల ప్రకారం నిర్ణీత రోజుల పాటు క్యూరింగ్ తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు. స్తంభం ఎంత భారాన్ని తట్టుకోగలదో పరీక్షించే ‘బ్రేకింగ్ టెస్ట్’ ను ఆయన సమక్షంలోనే నిర్వహించగా దాని ఫలితాలను విశ్లేషించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలు, భారీ గాలులు వీచినప్పుడు విద్యుత్ స్తంభాలు విరిగి పోకుండా ఉండాలంటే తయారీ దశలోనే అత్యున్నత ప్రమాణాలు పాటించాలని పేర్కొన్నారు. సీఎండీ వెంట చీఫ్ ఇంజనీర్ కె.తిరుమల్ రావు , ఎస్ఈ (సివిల్) వెంకటేశ్వర్లు, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

Exit mobile version