హైదరాబాద్ : చెరువులను ఎంతో వ్యయప్రయాశలతో పునరుద్ధరిస్తున్నామని, చెరువులు పూర్తయ్యే సరికి ఎస్‌టీపీ (సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్)లు కూడా సిద్ధమవ్వాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అధికారులను ఆదేశించారు. అప్పుడే చెరువుల పునరుద్ధరణ ప్రయోజనం ఉంటుందని అన్నారు. రెండోవిడత చేపట్టిన 14 చెరువుల పునరుద్ధరణలో భాగంగా రాజేంద్రనగర్ మండలం ఇబ్రహీంబాగ్‌లోని ఇబ్రహీంబాగ్ చెరువును హైడ్రా కమిషనర్ సందర్శించారు. పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. పూడిక ఏమాత్రం లేకుండా తొలగించాలని సూచించారు. అప్పుడే చెరువుల దుర్గంధం వదులుతుందన్నారు. అలాగే చెరువు పరిసరాల్లో భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. చెరువుల పునరుద్ధరణ జరిగిన సమయానికి ఎస్టీపీలు సిద్ధం కాకపోతే మళ్లీ మురుగు నీరు చేరి జలాలు కలుషితమయ్యే ప్రమాదముందని హెచ్చరించారు.
ఎస్‌టీపీల పనులను పర్యవేక్షిస్తున్న జలమండలి అధికారులతో మాట్లాడారు. చెరువు పై భాగంలో ఎస్‌టీపీల నిర్మాణంలో ఎలాంటి ఆటంకం లేకుండా చూస్తామన్నారు. పనులు వేగవంతం చేయాలని సూచించారు. 56 ఎంఎల్‌డీ సామర్థ్యంతో ఎస్‌టీపీలను నిర్మిస్తున్నట్టు జలమండలి అధికారులు కమిషనర్‌కు తెలిపారు. ఎస్‌టీపీల నుంచి వచ్చిన నీటిని కూడా ముందుగా సెడిమెంటేషన్ పాండ్‌లోకి తరలించి, అక్కడి నుంచి ప్రధాన చెరువులోకి చేరేలా చూడాలన్నారు హైడ్రా కమిషనర్. ఇదిలా ఉండగా ఇబ్రహీం చెరువు దాదాపు వంద ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలోకి వచ్చిన ఆక్రమణలను ఇప్పటికే హైడ్రా తొలగించింది. ఆయా ప్రాంతాలను చెరువు అభివృద్ధి పరిధిలోకి తీసుకు రావాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సూచించారు.
