అమరావతి : ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో టమాటా ధరలు పూర్తిగా పతనమయ్యాయంటూ, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారంటూ జరుగుతున్న ప్రచారం వాస్తవాలకు విరుద్ధమని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో నమోదవుతున్న అధికారిక ధరలను పరిశీలిస్తే టమాటా ధరలు స్థిరంగానే ఉన్నాయని తెలుస్తోందన్నారు. ములకల చెరువు వ్యవసాయ మార్కెట్ కమిటీలో జూన్ 25న 10 కిలోల టమాటా కనిష్ఠ ధర రూ.100, గరిష్ఠ ధర రూ.210, మోడల్ ధర రూ.180 నమోదైందన్నారు. అలాగే గుర్రంకొండ సబ్ మార్కెట్ యార్డులో 10 కిలోల టమాటా కనిష్ఠ ధర రూ.112, గరిష్ఠ ధర రూ.192, మోడల్ ధర రూ.152 నమోదైందని తెలిపారు. ఈ అధికారిక గణాంకాలే మార్కెట్లోని వాస్తవ పరిస్థితిని తెలియ జేస్తున్నాయన్నారు. వాస్తవాలు తెలుసు కోకుండా అసత్య ప్రచారం చేయడం వల్ల రైతుల్లో అనవసర ఆందోళన నెలకొనడమే కాకుండా మార్కెట్‌పై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
అలాగే చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరులో ఉన్న జైన్ మ్యాంగో పల్ప్ యూనిట్‌కు సంబంధించి వస్తున్న ప్రచారంపై కూడా మంత్రి స్పందించారు. రెండు యూనిట్లలో ఒకటి నిరంతరంగా పనిచేస్తుండగా, మరో యూనిట్లో బాయిలింగ్ విభాగంలో ఏర్పడిన సాంకేతిక సమస్యను రెండు రోజుల వ్యవధిలోనే పరిష్కరించి తిరిగి కార్యకలాపాలు ప్రారంభించినట్లు అధికారుల నివేదికలో స్పష్టమైందన్నారు. యూనిట్ అనేక రోజులుగా నిలిచి పోయిందన్న ప్రచారం నిజం కాదని, ప్రస్తుతం మామిడి పండ్ల అన్లోడింగ్ ప్రక్రియ కొనసాగుతోందని, రైతులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, మార్కెట్ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటోందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులు అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించాలని, నిరాధార ప్రచారాలను పట్టించుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

















