తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సంచలన ప్రకటన చేశారు. శ్రీవారి భక్తులకు తీపి కబురు చెప్పారు. తిరుమల తరహాలో టిటిడి పరిధి లోని ఇతర ఆలయాలలో కూడా రుచికరంగా అన్నప్రసాదాలు పంపిణీ చేయాలని ఆదేశించారు. ఈ మేరకు తక్షణమే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సుదూర ప్రాంతాల నుంచి ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి స్వామి వారిని దర్శించుకునేందుకు వస్తుంటారని తెలిపారు. వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని టీటీడీ ఆధ్వర్యంలోని ప్రతి ఆలయంలో ఇక నుంచి అన్న ప్రసాదం కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు అనిల్ కుమార్ సింఘాల్. భక్తులకు అన్నప్రసాదాలను రుచికరంగా, శుచికరంగా, నాణ్యంగా అందించాలని అధికారులను ఆదేశించారు. టిటిడిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ టిటిడి ఆధ్వర్యంలోని ఆలయాలలో అన్నప్రసాదాల పంపిణీకి సంబంధించి అన్న ప్రసాదాల తయారు చేసే పోటు సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని స్పష్టం చేశారు. అన్న ప్రసాదాల పంపిణి పటిష్టంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. టిటిడి ఆలయాలలో ఇప్పటి వరకు పంపిణీ చేస్తున్న అన్నప్రసాదాలపై రోజు వారి నివేదికను తయారు చేయాలన్నారు. టిటిడిలో ఇంకనూ ఎవరైనా అన్య మతస్తులు ఉంటే వారిని గుర్తించి తదుపరి చర్య కొరకు నివేదిక తయారు చేయాలని సూచించారు. దేశ వ్యాప్తంగా టిటిడి పరిధిలో చేరిన చారిత్రాక ఆలయాలకు, ఇతర ఆలయాలకు ఏఏ ఆలయాలకు వేద పారాయణదారులను నియమించాలి, ఎంత మంది అర్చకులను నియమించాలనే అంశంపై సమగ్ర నివేదిక రూపొందించాలని ఆదేశించారు.
