చెన్నై : రాష్ట్రంలో యుద్ద ప్రాతిపదికన విపత్తు నిర్వహణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. విపత్తు నిర్వహణ చర్యలపై సమీక్ష చేపట్టారు. చెన్నైలోని ‘స్టేట్ ఎమర్జెన్సీ యాక్షన్ సెంటర్’ (రాష్ట్ర అత్యవసర కార్యాచరణ కేంద్రం)లో సి. జోసెఫ్ విజయ్ రుతుపవనాల సన్నద్ధతపై ఆరా తీశారు. రెవెన్యూ పరిపాలన, విపత్తు నిర్వహణ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఈ కేంద్రంలో ముఖ్యమంత్రి పర్యటించి కార్యకలాపాలను పరిశీలించారు. ఇప్పటికే ప్రారంభమైన ఈశాన్య రుతుపవనాల ప్రభావాన్ని ఎదుర్కోవడానికి వివిధ శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆయన సూచించారు. అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు అధికారులు ఎటువంటి జాప్యం లేకుండా స్పందించాలని ఆదేశించారు. చెన్నైతో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో రుతుపవనాలను ఎదుర్కోవడానికి తీసుకున్న ముందస్తు జాగ్రత్తలు, సమన్వయ ప్రయత్నాలను ఆయన స్వయంగా సమీక్షించారు.
భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు గుర్తించిన జిల్లాల కలెక్టర్లతో ఆయన మాట్లాడారు. వర్షాలు, వరదల వల్ల ప్రాణనష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, తగిన భద్రతా ఏర్పాట్లు ఉండేలా చూడాలని కలెక్టర్లను ముఖ్యమంత్రి కోరారు. ‘ఎల్ నినో’ ప్రభావాలను కూడా పరిగణనలోకి తీసుకుని రుతుపవన పరిస్థితులను ఎదుర్కోవాలని ఆయన సూచించారు. భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం, నీలగిరి, కోయంబత్తూరు, దిండిగల్, విరుదునగర్, తెన్కాసి, కన్యాకుమారి, తిరునెల్వేలి, తేని, శివగంగై, పుదుకోట్టై, తిరువారూర్, తంజావూరు, నాగపట్నం, మయిలాదుతురై జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారిక ప్రకటన పేర్కొంది. విపత్తు నిర్వహణ శాఖ ఒక ‘ఇంటిగ్రేటెడ్ మల్టీ-హజార్డ్ మానిటరింగ్ డాష్బోర్డ్’ (సమీకృత బహుళ-ప్రమాద పర్యవేక్షణ వ్యవస్థ)ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా అధికారులు జిల్లా స్థాయి విపత్తు నిర్వహణ అధికారులతో నిరంతరం వీడియో కాల్స్ ద్వారా సంప్రదింపులు జరుపుతూ, విపత్తు నివారణ , సహాయక చర్యలకు సంబంధించిన సమాచారాన్ని పంచుకుంటున్నారు.


















