హైదరాబాద్ : ‘ఇరుముడి’ చిత్రం ‘మాస్ మహారాజా’ రవి తేజ కెరీర్లో ఒక గొప్ప విజయంగా నిలిచింది, ఇది ఆయనకు ఒక బలమైన పునరాగమనాన్ని అందించింది. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం తండ్రీకూతుళ్ల మధ్య ఉండే భావోద్వేగ బంధం నేపథ్యంలో సాగుతుంది. గత ఏడాది ఆగస్టులో విడుదలైన ఈ చిత్రం సుమారు రూ. 21 కోట్ల బ్రేక్-ఈవెన్ లక్ష్యంతో బాక్సాఫీస్ బరిలోకి దిగింది. అయితే,అంచనాలను మించి రాణించిన ఈ సినిమా, రూ. 150 కోట్లకు పైగా షేర్ , సుమారు రూ. 250 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఆ ఏడాది అతిపెద్ద బ్లాక్బస్టర్లలో ఒకటిగా నిలిచింది.
ముఖ్యంగా విడుదలైన కేవలం ఒకటిన్నర రోజుల్లోనే బ్రేక్-ఈవెన్ లక్ష్యాన్ని చేరుకోవడం ద్వారా ‘ఇరుముడి’ టాలీవుడ్ 105 ఏళ్ల చరిత్రలోనే ఒక రికార్డు సృష్టించింది. అంతే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో వరుసగా 20 రోజుల పాటు ప్రతిరోజూ రూ. 1 కోటికి పైగా షేర్ వసూళ్లను సాధించడం మరో విశేషం.
ఈ చిత్రంలో రవి తేజ సరసన ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటించగ ఆయన కుమార్తె పాత్రలో నక్షత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. రవి తేజతో పాటు చిత్రంలోని నటీనటులందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. ముఖ్యంగా నక్షత్ర తన నటనకు మంచి ప్రశంసలు అందుకున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. “మల్లెపూల పల్లకి”, “ఇరుముడి”, “యాల యలో” వంటి పాటలు శ్రోతలను అలరించడమే కాకుండా,సినిమాకు మరింత ఆదరణను తెచ్చిపెట్టాయి.
‘ఇరుముడి’ విజయానికి ముందు, రవి తేజ వరుస పరాజయాలను ఎదుర్కొన్నారు. ఆయన నటించిన ‘ఈగల్’, ‘మిస్టర్ బచ్చన్’, ‘మాస్ జాతర’, ‘భారత మహాశయులకు విజ్ఞప్తి’ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను అందుకోలేక పోయాయి. అదేవిధంగా దర్శకుడు శివ నిర్వాణ కూడా ‘మజిలీ’ తర్వాత ఆ స్థాయి భారీ వాణిజ్య విజయాన్ని అందుకోలేక పోయారు. ఈ నేపథ్యంలో, “ఇరుముడి” చిత్రం సాధించిన విజయం నటుడికి , దర్శకుడికి ఎంతో ప్రత్యేకమైనదిగా మారింది. పలు ఇంటర్వ్యూలలో, దర్శకుడు శివ నిర్వాణ ఈ చిత్ర విజయం అయ్యప్ప స్వామి ఆశీస్సుల వల్లే సాధ్యమైందని పేర్కొంటూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
చిత్రం ఘనవిజయం సాధించిన తర్వాత, దర్శకుడు శివ నిర్వాణ , నిర్మాత రవి శంకర్ ‘అయ్యప్ప దీక్ష’ను స్వీకరించారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్లో ఉన్న ఒక ప్రముఖ ఆలయంలో వీరు ఈ దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
















