హైదరాబాద్ : తెలంగాణ డీజీపీ బి. శివధర్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. గురువారం జరగనున్న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి భద్రతా ఏర్పాట్లపై వివరాలు వెల్లడించారు. హైదరాబాద్ నగరం మినహా రాష్ట్ర వ్యాప్తంగా 3,800కు పైగా గ్రామ పంచాయతీలలోని సుమారు 37,000 వార్డులకు పోలింగ్ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆయన తెలిపారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా పర్యవేక్షించేందుకు 3,000కు పైగా గ్రామ పంచాయతీలలో వెబ్‌కాస్టింగ్ ద్వారా ప్రత్యక్ష నిఘా ఏర్పాటు చేసినట్లు డిజిపి పేర్కొన్నారు.
పోలింగ్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతమైన బందోబస్తు చర్యలు చేపట్టామని డిజిపి శివధర్ రెడ్డి తెలిపారు. ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా జరిగేందుకు సివిల్ పోలీసులు, ఆర్మ్‌డ్ రిజర్వ్, తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (టీజీఎస్‌పీ) బలగాలతో పాటు, ఇతర ప్రభుత్వ శాఖలలో డిప్యూటేషన్ పై పనిచేస్తున్న పోలీసు సిబ్బందిని సైతం విధుల్లోకి తీసుకున్నామని ఆయన చెప్పారు. సున్నితత్వం ఆధారంగా అన్ని పోలింగ్ కేంద్రాలను ‘క్లిష్టమైన’, ‘సాధారణ’ కేంద్రాలుగా వర్గీకరించి, ఆయా ప్రాంతాల భద్రతకు అనుగుణంగా పోలీసు బలగాలను మోహరించినట్లు డిజిపి వివరించారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో, కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా పూర్తి భద్రతను ఏర్పాటు చేశామని డీజీపీ స్పష్టం చేశారు.
















