తిరుమల : శ్రీవారి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమలలో చేపట్టిన పుష్పాలంకరణలకు భక్తుల నుండి విశేష ప్రశంసలు వచ్చాయని టీటీడీ గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు తెలియ జేశారు. తిరుమలలోని రామ్ భగీచా-2లోని మీడియా సెంటర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుమలలో పుష్పాలంకరణలు చేపట్టేందుకు దాదాపు 30 మంది దాతలు ముందుకు వచ్చారని తెలిపారు. వారి సహకారం, ఉన్నతాధికారుల ప్రోత్సాహం, ఉద్యానవన సిబ్బంది కృషితో తిరుమలలో అత్యంత శోభాయమానంగా పుష్పాలంకరణలు చేపట్టామని చెప్పారు. దాదాపు 60 టన్నుల పుష్పాలు, 5 లక్షల కట్ ఫ్లవర్స్, 80 వేల సీజనల్ ఫ్లవర్స్ వినియోగించినట్లు తెలిపారు. శ్రీవారి ఆలయం వద్ద బ్రహ్మోత్సవాల తొలిరోజు, గరుడసేవ రోజు, ఏడో రోజు పుష్పాలంకరణలు మార్చడం జరిగిందని చెప్పారు డిప్యూటీ డైరెక్టర్.
జీఎన్సీ వద్ద ఏర్పాటు చేసిన పుష్పాలంకణ భక్తులను విశేషంగా ఆకట్టుకుందని పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా కల్యాణ వేదిక వద్ద ఏర్పాటు చేసిన ఫల, పుష్ప ప్రదర్శనలో చిన్న పిల్లలకు పురాణాలపై ఆసక్తి కలిగేలా 24 రకాల కాన్సెప్ట్ లతో పుష్పాలంకరణలు చేపట్టినట్లు తెలియజేశారు. భవిష్యత్తులో ఏఐ సహకారంతో తిరుమలలో ఉద్యాన వనాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు టీటీడీ గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ తెలిపారు. తిరుమలలో 34 ఉద్యానవనాలు ఉన్నాయనీ, 20 ఉద్యాన వనాలను దాతలు నిర్వహిస్తుండగా, 14 ఉద్యానవానాలను టీటీడీ నిర్వహిస్తోందని చెప్పారు. ఈ ఉద్యానవనాలను నిర్వహణలో ఏఐ భాగస్వామ్యంతో మరింత అందంగా తీర్చిదిద్దనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పీఆర్వో కుమారి నీలిమ, శ్వేత డైరెక్టర్ డాక్టర్ వేమా వేంకటరత్నం, పాల్గొన్నారు.


















