హైదరాబాద్ : సోషల్ మీడియాలో ఏఐ డీప్ ఫేక్ వీడియోలపై సంచలన వ్యాఖ్యలు చేశారు జూనియర్ ఎన్టీఆర్ . వ్యాప్తి చేయడం పట్ల మండిపడ్డారు. ఇదే సమయంలో పెద్ద ఎత్తున సినీ రంగానికి చెందిన పలువురు సాంకేతిక నిపుణులు, దర్శకులు, నటీ నటులు మద్దతు ఇచ్చారు. ఈ సందర్బంగా సీరియస్ గా స్పందించారు మెగాస్టార్ చిరంజీవితో పాటు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. మనం అత్యంత నీచమైన స్థాయికి దిగజారిపోయాం అని వాపోయారు జూనియర్ ఎన్టీఆర్. ‘దేవర’ చిత్రంలోని ‘చుట్టమల్లె’ పాటలో జూనియర్ ఎన్టీఆర్ , జాన్వీ కపూర్ ఉన్న దృశ్యాలను కృత్రిమ మేధస్సు ద్వారా మార్ఫ్ చేసి ఆన్‌లైన్‌లో విడుదల చేయడంతో ఈ వివాదం మొదలైంది. మహిళలను కించపరిచేలా మార్చబడిన ఈ ఏఐ-సృష్టిత వీడియో తీవ్ర దిగ్భ్రాంతిని, ఆందోళనను కలిగించింది. దీనిపై నటుడు ఎన్టీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా తన ఆగ్రహాన్ని వెల్లడించారు.
ఈ వివాదం నేపథ్యంలో మానవ విలువల విషయంలో సమాజం అత్యంత నీచమైన స్థాయికి దిగజారి పోతోందని పేర్కొంటూ విజయ్ దేవరకొండ ఎన్టీఆర్‌కు మద్దతుగా నిలిచారు. విజయ్ దేవరకొండ ఇలా స్పందించారు: మనం అత్యంత నీచమైన స్థాయికి దిగజారి పోయాం. దీనికి బాధ్యులైన వారిని అస్సలు వదలకూడదు. వారు కఠినమైన చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాలి . ఇతరులకు గుణపాఠం అయ్యేలా శిక్షించబడాలి. దీన్ని మనం ఊరికే వదిలేయకూడదు. మనం ఒకరి పట్ల ఒకరు ఎప్పుడు ఇంతటి అసంవేదనతో వ్యవహరించడం మొదలు పెట్టాం? ఎలాంటి పెంపకం జరుగుతోంది? మనం ఎలాంటి సమాజంలో జీవిస్తున్నాం? ఒకరినొకరు కించ పరచుకోవడంలో ఆనందం పొందే సమాజమా ఇది? అని ప్రశ్నించారు.
ఏఐ వల్ల జీవనోపాధి దెబ్బ తింటుందని, ఉద్యోగాలు పోతాయని ప్రపంచం ఆందోళన చెందుతూ చర్చిస్తున్న తరుణంలో, కొందరు మూర్ఖులు అదే సాంకేతికతను ఉపయోగించి ఇలాంటి నీచమైన పనులు చేస్తున్నారని ఆరోపించారు. ఇది లైంగిక దాడితో సమానమైన డిజిటల్ నేరం తప్పా మరోటి కాదన్నారు. చట్టం ఇలాంటి చర్యలను అత్యంత తీవ్రంగా పరిగణించాలని అన్నారు. దీనికి వ్యతిరేకంగా పోరాడుతున్న వారికి నా పూర్తి మద్దతు ఉంటుందన్నారు మెగాస్టార్ చిరంజీవి.



















