అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. గురువారం విశాఖ, తిరుపతి, అమరావతి ఎకనమిక్ రీజియన్ల అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేపట్టారు. మూడు రీజియన్లల్లో చేపట్టిన ప్రణాళికలు, అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల కల్పన, పరిశ్రమల గ్రౌండింగ్ వంటి అంశాలపై అధికారులు ప్రజంటేషన్ ఇచ్చారు. ఉత్తరాంధ్రలో పోర్టులు, ఐటీ, డేటా సెంటర్లు, భారీ పరిశ్రమలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు సీఎం. రాయలసీమలో సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, గ్రీన్ ఎనర్జీ పరిశ్రమలకు పెద్దపీట వేస్తామన్నారు. అమరావతి ప్రాంతంలో క్వాంటం టెక్నాలజీ, ఐటీ, లాజిస్టిక్స్, పోర్టు ఆధారిత పరిశ్రమలు, అగ్రి వాల్యూ చైన్ రంగాల్లో అభివృద్ధికి కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. మూడు ఆర్థిక ప్రాంతాల్లో పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనకు ప్రత్యేక ప్రణాళికలు తయారు చేయాలన్నారు. విశాఖ ఎకనమిక్ రీజియన్-VER పరిధిలో వివిధ శాఖల్లో 167 అభివృద్ధి పనులకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. ఇప్పటికే 64 పనులను ప్రారంభించడం జరిగిందన్నారు నారా చంద్రబాబు నాయుడు.
VERకు యాంకర్ ప్రాజెక్టుగా వైజాగ్ బే సిటీ మారిందన్నారు. మధురవాడ, కాపులుప్పాడ, ఆనందపురం ప్రాంతాల్లో ఐటీ, డేటా సెంటర్ హబ్‌ల అభివృద్ధి చేస్తామని తెలిపారు. విశాఖలో స్టీల్ సిటీ, కాకినాడ ఇండస్ట్రియల్ సిటీ, పోర్టుల విస్తరణకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. విశాఖలో 15–20 కొత్త ఐటీ సంస్థలను ఆకర్షించడం.. ఇప్పటికే ఉన్న సంస్థల ద్వారా 2 లక్షల ఉద్యోగాల హామీని కార్యరూపంలోకి తేవడమే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు సీఎం. తీర ప్రాంత అభివృద్ధి, కోనసీమ బ్యాక్ వాటర్స్ అభివృద్ధిపై దృష్టి సారించినట్లు తెలిపారు. అరకు, మారేడుమిల్లి వంటి ప్రాంతాల్లో ఎకో టూరిజం ప్రాజెక్టులపై ఫోకస్ పెడుతున్నామన్నారు. అగ్రి ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్, స్పేస్, ఎయిర్ క్రాఫ్ట్, ఆటో, ఈవీ, డిఫెన్స్, టూరిజం, నాలెడ్జ్ రంగాలకు కేంద్రంగా తిరుపతి ఎకనమిక్ రీజియన్ మారనుందన్నారు. ఏపీలోని 87 గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో TER పరిధిలో 66 ప్రాజెక్టుల పెట్టుబడులు వచ్చాయన్నారు సీఎం.



















