అమరావతి : ఏపీలో అడవితల్లి బాట కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిరంతర పర్యవేక్షణలో రహదారి పనుల్లో స్పష్టమైన పురోగతి కనిపిస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అడవితల్లి బాట తొలి దశలో రూ. 1,005 కోట్లతో 1,069 కి.మీ. రహదారుల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. అడవితల్లి బాట 2.0 విస్తరణతో మొత్తం రూ. 2,078 కోట్లతో 2,310 కి.మీ. రహదారుల అభివృద్దికి ప్లాన్ చేశారు. విస్తరణ పనుల్లో ఇప్పటికే 905 కి.మీ. రహదారుల నిర్మాణం పూర్తి కావడం విశేషం. పెండింగ్ పనులపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సమీక్ష చేపట్టారరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మిగిలిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అటవీ అనుమతులు జాప్యం లేకుండా సమన్వయం చేసుకోవాలని పేర్కొన్నారు. వర్షాల వల్ల ఆటంకాలు ఉన్న రోడ్లు మినహా మిగిలిన పనులు కొనసాగించాలని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం. డోలీ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంలో ప్రతి ఒక్కరు భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు . అడవితల్లి బాట కార్యక్రమం మొదటి రోజు నుంచి పనుల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పనులు వేగంగా ముందుకు తీసుకువెళ్లే విధంగా పవన్ కళ్యాణ్ సూచనలు చేస్తున్నారు.
అడవితల్లిబాట కార్యక్రమంలో భాగంగా చాలా గ్రామాలకు రోడ్డు వేయడం కంటే ముందు దారి నిర్మించేందుకు సంక్లిష్ట పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. రోడ్ల నిర్మాణంలో భాగంగా పెద్ద పెద్ద గుట్టలను కంట్రోల్డ్ బ్లాస్టింగ్ ద్వారా బ్రేక్ చేసి, రాళ్లు పగలగొట్టి దారి ఏర్పాటు చేశారు. ఆ దారిపై రోడ్ల నిర్మాణం చేపడుతున్నారు. దారులు వేసిన తర్వాత కొన్ని ప్రాంతాలకు వాతావరణ పరిస్థితులు అనుకూలించక నిర్మాణ సామాగ్రి చేరుకోవడం కష్టతరంగా మారింది. అలాంటి సవాళ్ల మధ్య గిరిశిఖర గ్రామాలకు సైతం డోలీ కష్టాల నుంచి విముక్తి కల్పించాలన్న దృఢ సంకల్పంతో ఉప ముఖ్యమంత్రి ప్రణాళికలతో ముందుకు తీసుకు వెళ్తున్నారు.
నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా పెండింగ్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు . అటవీ అనుమతుల ప్రక్రియలో జాప్యం లేకుండా ఆయా జిల్లాల కలెక్టర్లు శాఖల మధ్య సమన్వయ బాధ్యత తీసుకుని త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రికార్డు స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలకు అటవీ అనుమతుల ప్రక్రియ పూర్తి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. వర్షాల కారణంగా పనులకు ఆటంకాలు ఏర్పడిన ప్రాంతాలు మినహా, మిగిలిన అన్ని ప్రాంతాల్లో పనులు నిరంతరాయంగా కొనసాగించాలని స్పష్టం చేశారు.
