హైదరాబాద్ : అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్స్ ను దేశంలోనే రోల్ మోడల్ గా తీర్చి దిద్దాలని అన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. ప్రీ బడ్జెట్ సమావేశాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు జారీ చేశారు. సమావేశాల్లో పాల్గొన్నారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజహరుద్దీన్. విద్య, ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. యుద్ధ ప్రాతిపదికన హాస్టల్ భవనాల మరమ్మతులు చేపట్టాలని అన్నారు. దేశంలోనే మోడల్‌గా అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లు ఉండాలన్నారు. ఇందుకు సంబంధించి నిధులు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామన్నారు.
సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల్లో అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని , కనీస వసతుల కల్పనపై దృష్టి సారించాలని స్పష్టం చేశారు మల్లు భట్టి విక్రమార్క. లక్ష కోట్లకుపైగా నిధులతో రాష్ట్రంలో రహదారుల నిర్మాణం జరుగుతుందని అన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని స్పష్టం చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఇరిగేషన్, సివిల్ సప్లైస్ శాఖలపై ప్రీ-బడ్జెట్ సమీక్ష సమావేశాన్ని ఉప ముఖ్యమంత్రి చేపట్టారు. రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రాధాన్య కార్యక్రమాలు, సాగునీటి ప్రాజెక్టుల పురోగతి, ఆహార భద్రత కార్డు, ఉచిత సన్న బియ్యం పథకం, ప్రజలకు సమర్థవంతమైన సేవలందించే విధానాలపై విస్తృతంగా చర్చించారు.