హైదరాబాద్ : తెలంగాణ సర్కార్ అనుసరిస్తున్న తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజ్ శ్రవణ్ కుమార్ ఆచారి. ఆయన మీడియాతో మాట్లాడారు. అడ్డగోలుగా తమకు ఇష్టం వచ్చినట్లు, ప్రజాభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండానే డీలిమిలిటేషన్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ఆయన ప్రధానంగా సికింద్రాబాద్ నియోజకవర్గం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ సందర్భంగా సీఎం ఎ. రేవంత్ రెడ్డి పై ఫైర్ అయ్యారు. సికింద్రాబాద్ అంటే కేవలం ఒక పిన్ కోడ్ కాదని, ఒక బ్యూరోక్రాటిక్ బ్లాక్ అంతకన్నా కాదని స్పష్టం చేశారు.
అడ్మినిస్ట్రేటివ్ మ్యాప్‌లో గీసి పారేసే ఒక గీత అసలే కాదని అన్నారు డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్. ఇది 200 ఏళ్ల సజీవ చరిత్ర, మన సంస్కృతి, ఉమ్మడి జ్ఞాపకం. ఎన్నో ఆధునిక నగరాల కంటే ముందే తనకంటూ ఒక విశిష్టమైన పౌర ఆత్మను (Civic Soul) సంతరించుకున్న నగరం అని పేర్కొన్నారు. 1806లో పురుడు పోసుకున్న సికింద్రాబాద్, తనదైన గుర్తింపుతో, ఒక ప్రత్యేక సంస్కృతితో ఎదిగిందని అన్నారు డాక్టర్ దాసోజు శ్రవణ్. హైదరాబాద్‌కు ‘ట్విన్ సిటీ’గా గర్వంగా భుజం భుజం కలిపి నిలిచిందన్నారు. ఇప్పుడు “పునర్వ్యవస్థీకరణ” అనే ముసుగులో ఆ పేరును తుడిచి వేయాలని చూడటం దారుణమన్నారు. లేదా దాన్ని వేరే దాంట్లో కలిపేయడం అంటే అది సాంస్కృతిక విధ్వంసం తప్పా మరోటి కాదన్నారు.
కేవలం పరిపాలనా సౌలభ్యం నెపంతో తరతరాల చరిత్రను కాలరాయడం ఎప్పటికీ సమర్థనీయం కాదని , గుర్తు పెట్టుకోవాలని అన్నారు. సికింద్రాబాద్ జోలికి వస్తే ఖబడ్దార్ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్.















