తిరుమల : తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆరో రోజైన శనివారం ఉదయం శ్రీ మలయప్ప స్వామి వారు హనుమంత వాహనంపై కోదండ రాముని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ధనుస్సు, బాణం ధరించి, తన పరమభక్తుడైన హనుమంతునిపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. వాహనం ముందు భక్తబృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తించగా, మంగళ వాయిద్యాల నడుమ వాహన సేవ వైభవంగా సాగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామి వారిని దర్శించుకున్నారు.
భగవద్భక్తులలో అగ్రగణ్యుడైన హనుమంతుడు శ్రీరామునిపై అచంచలమైన భక్తికి ప్రతీక. చతుర్వేద పండితుడు, అపార పరాక్రమశాలి అయిన ఆంజనేయునిపై శ్రీ మలయప్ప స్వామి వారు విహరించడం భక్తులకు విశేష ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది. గురు శిష్యులైన శ్రీరాముడు, హనుమంతుడి దివ్య సంబంధాన్ని ఈ వాహనసేవ స్మరింప జేస్తుంది. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు శ్రీ మలయప్ప స్వామి వారు పుష్పక విమానంపై, రాత్రి 7 గంటలకు గజ వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు స్వామి వారు.
ఈ వాహనసేవల్లో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యుల నరేష్ కుమార్, శాంతారామ్, రంగశ్రీ, జానకీ దేవి, సదాశివమ్, సీవీఎస్వో మురళీకృష్ణ, తదితర ప్రముఖులు పాల్గొన్నారు.



















