20 లక్షల ఉద్యోగాల కల్పనే మా ధ్యేయం

భారత్ ఏఐ శక్తి కాంక్లేవ్ లో మంత్రి నారా లోకేష్

Hellotelugu-NaraLokesh

విశాఖపట్నం : రాష్ట్రంలో 20 ల‌క్ష‌ల ఉద్యోగాల క‌ల్ప‌నే త‌మ ల‌క్ష్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు మంత్రి నారా లోకేష్. భారతదేశ డిజిటల్ ప్రయాణంలో నూతన అధ్యాయం ప్రారంభమైందన్నారు. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ కు ఇది కీలకమైన మలుపుగా పేర్కొన్నారు.విశాఖపట్నం.. మనం ప్రేమగా వైజాగ్ అని పిలిచే ఈ నగరం సాధారణ నగరం కాదు. దశాబ్దాలుగా ఇది భారతదేశానికి ఒక గేట్ వేలా పనిచేస్తోందని చెప్పారు. భారతదేశంలోని ఖనిజ సంపదను ప్రపంచానికి అనుసంధానించింది. ఈ నగరం ఉక్కుతో నిర్మితమైంది. కానీ ఈ రోజు మనం విశాఖ పునాదులను ఏఐ విప్లవంపై నిర్మించ బోతున్నాం అన్నారు లోకేష్‌.

ప్రపంచం రోజురోజుకీ మారుతోందని అన్నారు. ప్రపంచం భారీ పరిశ్రమల నుంచి డిజిటల్ మౌలిక సదుపాయాల వైపు, తయారీ నుంచి మెషిన్ ఇంటెలిజెన్స్ వైపు మారుతోందని చెప్పారు. ఈ ప్రయాణంలో వైజాగ్ మళ్లీ అభివృద్ధి చెందుతోందన్నారు. గూగుల్ ఏఐ హబ్ ప్రారంభంతో ఈ మార్పును మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి 15 బిలియన్ డాలర్ల పెట్టబడితో పాటు ఒక గిగా వాట్ డేటా సెంటర్ ఎకోసిస్టమ్ ఏర్పాటు కానుంద‌ని తెలిపారు. ఇది సాధారణ వృద్ధి కాదు, భారీస్థాయి అభివృద్ధి. మొదటిసారి వైజాగ్ లో కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయని ప్ర‌క‌టించారు. కనెక్టివిటీ విషయంలో మనం ఇతర రాష్ట్రాలతో పోటీ పడతాం అన్నారు. ఒకప్పుడు పోర్టులు ఈ నగరాన్ని ప్రపంచంతో కలిపినట్లే, ఈ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లు డిజిటల్‌గా ప్రపంచంతో అనుసంధానం చేస్తాయన్నారు.

Exit mobile version