హైదరాబాద్ : ప్రముఖ నటి అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్ , కేవీ నరేష్ కీ రోల్ పోషించిన క్రేజీ కళ్యాణం చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కుటుంబ బంధాలను ఆవిష్కరించే ప్రయత్నం చేసింది. భద్రప్ప గజ్జుల దర్శకత్వంలో రూపొందిన ఈ తెలుగు ఫ్యామిలీ ఎంటర్టైనర్, వివాహం, కుటుంబ బంధాలు, బాలికా విద్య ప్రాముఖ్యత వంటి అంశాల చుట్టూ సాగుతుంది. ఈ చిత్రం మంచి సందేశాన్ని అందించినప్పటికీ కథనంలో కొన్ని లోపాలు ఉన్నాయి. హాస్యం , నటీనటుల అద్భుతమైన నటన కొన్ని సన్నివేశాలను అలరించేలా చేస్తాయి. రొటీన్ ప్రేమకథ , నెమ్మదైన కథనం సినిమా అనుభవాన్ని కొంత వరకు దెబ్బ తీశాయి. కథ విషయానికి వస్తే ఈ కథ పార్వతాలు (వి.కె. నరేష్) అనే వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. అతను తన కుటుంబ గౌరవాన్ని కాపాడు కోవాలని ఆశిస్తుంటాడు. అతని పెద్ద అల్లుడు బలరాజు (తరుణ్ భాస్కర్) ఒక తాగుబోతు, తను తరచుగా గ్రామంలో గొడవలు సృష్టిస్తుంటాడు.
పార్వతాలు తన చిన్న కుమార్తె కీర్తి (అనుపమ పరమేశ్వరన్)కి మంచి సంబంధం చూసి వివాహం చేయాలనుకుంటాడు. కానీ కీర్తి ఉదయ్ (అఖిల్ రాజ్) అనే వ్యక్తిని ప్రేమిస్తుంటుంది. పెళ్లికి ముందే తన చదువును పూర్తి చేయాలని కోరుకుంటుంది. కీర్తి తండ్రి అమెరికా నుండి ఒక సంబంధాన్ని ఖరారు చేయాలను కోవడంతో, తన కోరికలకు , తన కుమార్తె కలలకు మధ్య సంఘర్షణ మొదలవుతుంది. ఆ తర్వాత తన సొంత నిర్ణయాలను తీసుకోవడానికి కీర్తి చేసే పోరాటమే మిగిలిన కథ. కీర్తి పాత్రలో అనుపమ పరమేశ్వరన్ చక్కని నటనను కనబరిచారు. భావోద్వేగ సన్నివేశాల్లో ఆమె అద్భుతంగా నటించారు; తెలంగాణ గ్రామీణ నేపథ్యం ఉన్న యువతి పాత్రకు బాగా సరిపోయారు.
బలరాజు పాత్రలో తరుణ్ భాస్కర్ సినిమాకు కావాల్సిన హాస్యాన్ని అందించారు. వి.కె. నరేష్తో ఆయన పంచుకున్న సన్నివేశాలు ప్రేక్షకులను బాగా అలరిస్తాయి. కుటుంబ గౌరవం గురించి ఆందోళన చెందే తండ్రి పాత్రలో వి.కె. నరేష్ ప్రాణం పోశాడు ఉదయ్ పాత్రలో అఖిల్ రాజ్ కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. ఈ సినిమా ప్రధాన బలం ఆడపిల్లల చదువు గురించిన దాని సందేశం. తల్లిదండ్రులు కొన్నిసార్లు తమ కూతుళ్ల చదువు కంటే పెళ్లిళ్లకే ఎక్కువ డబ్బు ఎలా ఖర్చు చేస్తారో ఇది హైలైట్ చేస్తుంది. సురేష్ బొబ్బిలి అందించిన సంగీతం, సినిమాటోగ్రఫీ సంతృప్తికరంగా ఉన్నాయి.
