అమరావతి : రాష్ట్రంలో కాలుష్యాన్ని వెదజల్లుతున్న పరిశ్రమలపై సీరియస్ అయ్యారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఉద్యోగులు- ప్రజలకు, ప్రభుత్వానికి జవాబుదారీగా పని చేయాలని స్పష్టం చేశారు. ఆంధ్ర పేపర్ మిల్స్ లాంటి సంస్థలు కాలుష్యాన్ని గోదావరిలోకి వదిలేస్తూ, స్థానిక సంస్థలకి పన్నులు ఎగవేస్తున్నాయని మండిపడ్డారు. ఉద్యోగులు మీ పని మీరు చేయండి. ప్రజలకు, ప్రభుత్వానికీ మాత్రమే జవాబుదారీగా పని చేయాలన్నారు. విద్యా సంస్థలు, హాస్టల్స్ లో సగటున ఒక విద్యార్థి రోజుకి 35 లీటర్ల నీరు వినియోగించారు అనుకుంటే ఎంత గ్రే వాటర్ వస్తుంది? చెత్త ఎంత వస్తుంది? అందుకు తగిన విధంగా పన్నులు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదాయాన్ని సృష్టించాలని చెబుతున్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాం . అందుకు తగిన విధంగా ఆదాయం పెంచుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్.
దీంతో తమ మీద ఆధారపడిన ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక పోతున్నాం అని ఆవేదన వ్యక్తం చేశారు. రూ. 10 వేలు సంపాదించే ఉద్యోగుల మీద భారం పెట్టి.. రూ. 100 కోట్లు సంపాదించే వారిని వదిలేస్తున్నాం అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా గ్రామ పంచాయతీలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పంచాయతీల్లో సొంత ఆదాయ వనరులు పెంచుకోవాలి. అందుకోసం కలప ఇచ్చే మొక్కలు ప్రతి పంచాయతీలో 2 వేలు నాటాలి. దీని కోసం పంచాయతీరాజ్, అటవీశాఖల మధ్య పరస్పర ఒప్పందం కుదిరింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో పంచాయతీలకు చేరతాయని వెల్లడించారు. ఒక పంచాయతీ యూనిట్ గా ఏ విధమైన ఆదాయ వనరులు ఉంటాయి? ఆ పంచాయతీకి ఎన్ని రకాల ఆదాయాలు సమకూర్చాలి అనే అంశంపై కూడా జిల్లా పంచాయతీ అధికారులతో కూడిన సాధికార కమీ అధ్యయనం చేయాలని ఆదేశించారు. బిల్ బోర్డులు, ఎంటర్ టైన్మెంట్ టాక్సులతోపాటు పంచాయతీలకు ఆదాయం పెంచేందుకు ఉన్న ప్రతి అవకాశాన్ని పరిశీలించాలి అని అన్నారు.
