హైదరాబాద్ : పేదల కోసం ప్రభుత్వ ఆసుపత్రులను ప్రోత్సహించే పాలకులు తమ సొంత వైద్య అవసరాల కోసం మాత్రం ఖరీదైన కార్పొరేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తూ, ప్రజల సొమ్మును ఖర్చు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. తెలంగాణ ప్రభుత్వం నవంబర్ 27న జారీ చేసిన ‘జీఓ ఆర్టీ నం. 612’ (GO Rt No. 612) ద్వారా రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వైద్య చికిత్స కోసం ఏకంగా రూ. 18,76,168 మొత్తాన్ని మంజూరు చేసింది. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ అపోలో హెల్త్ సిటీలో అక్టోబర్ 14–17 , అక్టోబర్ 21–26 తేదీల మధ్య జరిగిన చికిత్స కోసం ఈ భారీ మొత్తాన్ని ప్రభుత్వ ఖజానా నుండి చెల్లిస్తున్నారు.
‘4-వెసల్ సెరెబ్రల్ యాంజియోగ్రఫీ’, ‘కొరోనరీ యాంజియోగ్రామ్’ ‘డ్యూరల్ ఏవీఎఫ్ ఎంబోలైజేషన్’ (dural AVF embolization) చికిత్సలకు సంబంధించి, వరుసగా ₹4,10,909 , ₹14,65,259 విలువైన రెండు బిల్లులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సామాన్య ప్రజలు ‘ఆరోగ్యశ్రీ’ లేదా ‘సీఎం సహాయ నిధి’ (CM Relief Fund) కోసం నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటే, మంత్రికి సంబంధించిన బిల్లులు మాత్రం నెల రోజులు గడవక ముందే అత్యంత వేగంగా మంజూరు కావడం గమనార్హం.
ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే, ప్రస్తుత నిబంధనల ప్రకారం ఈ ₹18.76 లక్షల చెల్లింపునకు ఆర్థిక శాఖ నుండి ప్రత్యేక అనుమతి కూడా అవసరం లేదని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రవాణా, రోడ్లు మరియు భవనాల శాఖ, మంత్రుల వైద్య రీయింబర్స్మెంట్ ఖాతా నుండి ఈ మొత్తాన్ని నేరుగా అపోలో ఆసుపత్రి బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. సాధారణ ఉద్యోగుల వైద్య రీయింబర్స్మెంట్ బిల్లులే ఇంకా పెండింగ్లో ఉండగా, కోట్ల రూపాయల ఆస్తులు కలిగిన మంత్రుల కార్పొరేట్ ఆసుపత్రి బిల్లులను ప్రజల పన్నుల సొమ్ముతో చెల్లించడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
