న్యూఢిల్లీ : ఏపీలో పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తయ్యేందుకు వెంటనే సహకరించాలని, నిధులు విడుదల చేయాలని కోరారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. సోమవారం కేంద్ర మంత్రి పాటిల్ ను కలిసి లేఖను అందజేశారు. ప్రాజెక్టు తదుపరి పనులకు సంబంధించి అవసరమైన నిధులను కూడా మంజూరు చేయాలన్నారు. ప్రధానమంత్రి కృషి సీంచాయి యోజన కింద రాష్ట్రంలోని వివిధ పథకాల పునరుద్ధరణ, ఆధునీకరణకు నిధులు మంజూరు కోరుతూ లేఖ ఇచ్చారు. హర్ ఖేత్ కో పానీ కార్యక్రమంలో భాగంగా చెరువులు, కుంటల మరమ్మతులు, పునరుద్ధరణ ,ఆధునీకరణ, కాలువల పూడిక తీత, గట్ల బలోపేతం లాంటి పనులు చేపట్టాల్సి ఉందని వెల్లడించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 297 నీటి వనరుల పునరుద్ధరణ కోసం రూ.285 కోట్ల నిధుల్ని విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కోరారు సీఎం చంద్రబాబు నాయుడు. సుప్రీం కోర్టు తుది తీర్పు వచ్చేంత వరకూ ఆలమట్టి ఎత్తు పెంచే అంశంపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయవద్దని సీఆర్ పాటిల్ కు విజ్ఞప్తి చేశారు. ఆనకట్ట ఎత్తును 519.60 మీటర్ల నుండి 524.256 మీటర్లకు పెంచితే ఏపీ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని ఎలాంటి సాంకేతిక, పాలనా పరమైన అనుమతులు మంజూరు చేయవద్దని స్పష్టం చేశారు. అప్పర్ కృష్ణా ప్రాజెక్ట్ ఫేజ్-III కింద భూసేకరణ ఇతర సన్నాహక పనులు చేయకుండా కర్ణాటకను ఆదేశించాలని, సుప్రీం కోర్టు తుది తీర్పు వచ్చేంత వరకూ యథాతథ స్థితిని కొనసాగించాలని కోరారు.
రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల దాహార్తిని తీర్చే పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేయాలని అన్నారు సీఎం. గోదావరి నుంచి సముద్రంలోకి వృధాగా పోయే 200 టీఎంసీల వరద జలాలలను మళ్లించేలా పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టును చేపడుతున్నట్టు వెల్లడించారు . వంశధారపై నేరడి బ్యారేజ్ నిర్మాణానికి జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ముందుకు వెళ్తామని పేర్కొన్నారు.
