తమిళనాడు : తమిళనాడు అస్తిత్వం, చరిత్ర, భాషలను లక్ష్యంగా చేసుకోవడానికి బీజేపీ ఏఐడీఎంకేను వాడుకుంటోందని సంచలన ఆరోపణలు చేశారు ఎంపీ రాహుల్ గాంధీ. ఒకప్పుడు తమిళనాడు అస్తిత్వాన్ని కాపాడిన పార్టీగా పేరు ఉండేదని, కానీ ఏఐడీఎంకే ఇప్పుడు బీజేపీ చేతిలో కీలుబొమ్మగా మారిందన్నారు . ఇక వారు ఏం చేస్తారంటూ ప్రశ్నించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తిరువళ్లూరు జిల్లాలోని పొన్నేరిలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ ఎన్నికల్లో, వారు తమిళనాడులోకి చొరబడటానికి ప్రయత్నిస్తున్నారని చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తమిళనాడు భావనను కాపాడిన గొప్ప నాయకులు ఏఐడీఎంకే పార్టీలో గతంలో ఉండే వారన్నారు.
కానీ నేటి నాయకులు గత నాయకులలా లేరని అన్నారు రాహుల్ గాంధీ. వారు ఇప్పుడు బీజేపీ చేతుల్లో రాజీపడిపోయారంటూ ఎద్దేవా చేశారు. బీజేపీ మిమ్మల్ని నేరుగా దెబ్బతీయలేదు, అందుకే మీ అస్తిత్వం, చరిత్ర ,భాషపై దాడి చేయడానికి వారు తమ భాగస్వామి అయిన ఏఐడీఎంకేను వాడుకుంటున్నారని అన్నారు. తాము తమిళ సంస్కృతి, చరిత్ర, భాష, సంప్రదాయాలను రక్షిస్తున్నామని అన్నారు. లోక్‌సభ స్థానాలను పెంచడమే లక్ష్యంగా రూపొందించిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు విషయంలో బీజేపీని ఇరకాటంలో పెడుతూ, ఈ చర్య దక్షిణం, ఈశాన్య భారతదేశాల ప్రాతినిధ్యాన్ని తగ్గించడానికి ఉద్దేశించినదని రాహుల్ గాంధీ ఆరోపించారు.
