హైదరాబాద్ : పశ్చిమ బెంగాల్ లో జరిగిన రాజకీయ భూకంపంపై అన్ని కెమెరాలూ దృష్టి పెట్టిన సమయంలో, దక్షిణాదిన ఒక పెద్ద పరిణామమే జరడం రాజకీయ వర్గాలను విస్తు పోయేలా చేసింది.
కాంగ్రెస్ తమిళనాడులో టీవీకేకు మద్దతుగా నిలిచి ఒక వ్యూహాత్మక మాస్టర్‌స్ట్రోక్ ఆడింది. ఇప్పుడు పరిస్థితిని గమనిస్తే కర్ణాటక వారి చేతిలో ఎలాగూ ఉంది. తెలంగాణ కూడా వారి చేతిలోనే ఉంది. కేరళ ఇవాళ యూడీఎఫ్ వైపు మొగ్గు చూపింది. ఇప్పుడు తమిళనాడులో కూడా అధికారంలో భాగస్వామ్యం కలిగి ఉండడం వ్యూహాత్మకంగా విజయం అని చెప్పక తప్పదు.
ఆంధ్రప్రదేశ్ తోపాటు పుదుచ్చేరిని మినహాయిస్తే మొత్తం దక్షిణ ద్వీపకల్పం దాదాపు కాంగ్రెస్ చేతిలోకి వెళ్లినట్టే. బీజేపీ తూర్పులో బలంగా దూసుకెళ్తున్న సమయంలో, దక్షిణం పూర్తిగా తనను తాను రక్షించుకుంది అనుకోక తప్పదు. ఇది కేవలం కొన్ని రాష్ట్రాల ఎన్నికల ఫలితాల కథ కాదు. ఇప్పుడిది పూర్తిగా రెండు వేర్వేరు రాజకీయ భారతదేశాల రూపం. అంటే 2029 నాడు రాబోయే పోరాట రేఖలు ఇప్పుడు అధికారికంగా ఏర్పడి పోయాయి అని అర్థం. రాబోయే రోజుల్లో రాజకీయంగా కీలక పరిణామాలకు వేదిక కానుంది దక్షిణ ప్రాంతం.
విచిత్రం ఏమిటంటే నిన్నటి దాకా కాంగ్రెస్ పార్టీ డీఎంకేతో కలిసి పోటీ చేసింది. ఆ పార్టీకి కొన్ని సీట్లు దక్కాయి. మరో వైపు డీఎంకే పార్టీ చీఫ్, సీఎం గా ఉన్న ఎంకే స్టాలిన్ కొలత్తూరు నుంచి పోటీ చేసి తన అనుంగు అనుచరుడిగా పేరు పొందిన వీఎస్ బాబు చేతిలో ఓటమి పాలయ్యారు. ఇది ప్రతి ఒక్కరినీ విస్తు పోయేలా చేసింది.
