హైదరాబాద్ : మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు నిప్పులు చెరిగారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. శారదా పీఠాన్ని కూల్చేందుకు కుట్రకు తెర లేపారంటూ ఆరోపించారు. ఎందుకు ఈ దేవాలయాన్ని కూల్చాలి అనుకుంటున్నావని నిలదీశారు. నిత్య అన్నదానం, వేద పాఠశాల, గోశాల, అమ్మవారి ఆలయం, ఇవ్వన్ని ఉండటం నీకు ఇష్టం లేదా అని భగ్గుమన్నారు. కేసీఆర్ అనవాళ్ళు మారుస్తాను అంటే ఆఖరికి కేసీఆర్ కట్టిన గుడులు కూడా కూలుస్తావా ఎంత ధైర్యం నీకు అని మండిపడ్డారు. ప్రజా పాలన అంటే కూల్చడమేనా అని ఫైర్ అయ్యారు తన్నీరు హరీశ్ రావు.
కోకాపేటలో మైనింగ్ కోసం భాగ్యలక్ష్మి మినరల్స్ అండ్ మైనింగ్ వాళ్లకు 10 ఎకరాలు కేటాయిస్తే.. 17 ఎకరాలు కబ్జా పెట్టారని ఆరోపించారు. ఔటర్ కి కిలోమీటర్ లోపల మైనింగ్ చేయొద్దని హెచ్ఎండీఏ చెప్పిందన్నారు. అయినా అక్కడ మైనింగ్ కోసం రేవంత్ రెడ్డి అల్లుడికి అప్పజెప్పాడని ధ్వజమెత్తారు . భాగ్యలక్ష్మి మినరల్స్ అండ్ మైనింగ్ వెనక రేవంత్ రెడ్డి మేనల్లుడు రమేష్ రెడ్డి, దీపక్ రెడ్డి, కౌశిక్ రెడ్డి ఈ క్రషర్ వెనక ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు హరీశ్ రావు. వాటర్ వెల్స్ కట్టడానికి నీ మేనల్లుడికి ఇచ్చిన 17 ఎకరాల భూమి పనికిరాదా.. శారాద పీఠమే కావాలా కూల్చడానికి అని ఫైర్ అయ్యారు.
