హైదరాబాద్ : సాయి ఈశ్వరాచారి మృతి చెందడానికి అధికారంలో ఉన్న కాంగ్రెస్ , బీజపీ పార్టీలే కారణమని సంచలన ఆరోపణలు చేశారు బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. గాంధీ ఆసుపత్రి వద్ద ఆందోళన చేస్తున్న వీరిని అరెస్ట్ చేశారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఆత్మహత్య చేసుకున్న సాయి ఈశ్వర చారి కి మద్దతు గా ఉదయం నుండి గాంధీ ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టారు వందలాది మంది సంఘాల కార్యకర్తలు , నాయకులు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. జాజుల శ్రీనివాస్ గౌడ్ బృందాన్ని తిరుమలగిరి పోలీస్ స్టేషన్ తరలించారు. 42% రిజర్వేషన్లు అమలు చేయనందుకే మనస్తాపానికి గురై సాయి ఈశ్వరాచారి బలిదానం చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది ముమ్మాటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన హత్యనేనంటూ ఆరోపించారు. రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డిలే ఈ హత్యకు బాధ్యత వహించాలని స్పష్టం చేశారు జాజుల శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న.రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ నిరసన వ్యక్తం చేయాలని, ఆందోళన చేపట్టాలని పిలుపునిచ్చారు. సాయి ఈశ్వరాచారి మృతి తోనైనా కేంద్రం, రాష్ట్రం దిగి రావాలన్నారు. తన మృతి పై పార్లమెంట్లో చర్చ జరగాలని కోరారు. బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని ఈ పార్లమెంటు సమావేశాల్లో నే ఆమోదించాలని, తక్షణమే సర్పంచ్ ఎన్నికలు నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. బీసీ ద్రోహూల పార్టీలైన కాంగ్రెస్, బిజెపిల నాయకుల ఇండ్లను ముట్టడించాలన్నారు. కాంగ్రెస్, బిజెపిలలో ఉన్న బీసీ నేతలు తమ పదవులకు రాజీనామా చేయాలని వార్నింగ్ ఇచ్చారు.















