హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రధానంగా రైతుల ప్రయోజనాల కోసమే భూముల రీసర్వే చేపడుతున్నామని, రైతుల భూ సమస్యల పరిష్కారానికి వారి సమక్షంలోనే రీసర్వే జరగాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. రీసర్వే జరిగే గ్రామాల్లో ప్రతిరోజు తహశీల్దార్లు పర్యటించాలని, ఆర్డీవో, అదనపు కలెక్టర్లు, కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించడమే గాక కనీసం వారానికో రోజు రీసర్వే జరిగే గ్రామాలకు వెళ్లాలని ఆదేశించారు. వచ్చే ఏడాది లోగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అంగుళం భూమిని సమగ్రంగా సర్వే చేసి, భూ యజమానులకు పూర్తి భద్రతతో కూడిన వివాద రహిత భూములను అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. భూమి ఉన్న ప్రతి రైతుకు ఆధార్ కార్డు తరహాలో వారి భూమికి సంబంధించిన సమగ్ర, భద్రతతో కూడిన రికార్డులు, పాస్ బుక్కులు అందించాలన్నది ప్రభుత్వ సంకల్పమని మంత్రి చెప్పారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి భూ సర్వే, రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, హౌసింగ్ అంశాలపై రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి డి. శ్రీధర్ బాబుతో కలిసి మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టరేట్లో సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ సమగ్ర భూ సర్వే కార్యక్రమాన్ని చట్టంలో నిర్దేశించిన విధంగా తొలుత రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఎంపిక చేసిన రెవెన్యూ గ్రామాల్లో మొదటి విడతగా వేగవంతంగా చేపట్టనున్నట్లు వెల్లడించారు. గతంలో హైదరాబాద్లో రాష్ట్రస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించామని, ఈసారి నేరుగా జిల్లాలకు వచ్చి స్థానిక ప్రజా ప్రతినిధులు, రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు, క్షేత్రస్థాయి రెవెన్యూ అధికారులతో సమావేశమై సమస్యలను సమీక్షిస్తున్నట్లు చెప్పారు.
మండల స్థాయి అధికారుల జాబితా నుంచి యాదృచ్ఛికంగా అధికారులను ఎంపిక చేసి, ఆయా మండలాల్లో సర్వేకు సంబంధించిన అంశాలు, పెండింగ్ దరఖాస్తులు, ప్రజల నుంచి వస్తున్న అభ్యంతరాలు, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులపై నేరుగా చర్చిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు కోరుతున్న అంశాలు, అధికారులకు ఎదురవుతున్న సమస్యలు, పరిష్కారానికి అవసరమైన ప్రభుత్వ స్థాయి అనుమతులు, మార్గదర్శకాలపై ఉన్నది ఉన్నట్లుగా అధికారులు వివరించాలని సూచించారు. సమస్యలను దాచిపెట్టకుండా స్పష్టంగా తెలియజేస్తే అక్కడికక్కడే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
ప్రజా సమస్యలను నిజాయితీగా పరిష్కరిస్తూ బాధ్యతాయుతంగా పనిచేసే అధికారులను ప్రభుత్వం అభినందిస్తుందని మంత్రి తెలిపారు. ఉద్దేశ పూర్వకంగా సమస్యలను తప్పుదోవ పట్టించే లేదా ప్రజలను ఇబ్బందులకు గురిచేసే అధికారులపై అదే స్థాయిలో తక్షణ చర్యలు ఉంటాయని హెచ్చరించారు. దాదాపు 125 ఏళ్ల క్రితం జరిగిన సర్వే తర్వాత రాష్ట్రంలో మరోసారి ఇంత విస్తృత స్థాయిలో సమగ్ర భూ సర్వే చేపడుతున్నామని మంత్రి పేర్కొన్నారు. ఈ సర్వే ద్వారా కేవలం భూముల కొలతలకే పరిమితం కాకుండా, సర్వే నంబర్లు ఒకచోట ఉండటం, భూముల వాస్తవ స్వాధీన స్థితి మరోచోట ఉండటం వంటి సమస్యలకు కూడా శాశ్వత పరిష్కారం లభిస్తుందని వివరించారు.
రెవెన్యూ, అటవీ శాఖల మధ్య సరిహద్దు వివాదాలు, పట్టా భూములకు సంబంధించిన సమస్యలు, భూముల హద్దులపై నెలకొన్న వివాదాలు వంటి అంశాలను కూడా సమగ్ర సర్వే ద్వారా గుర్తించి పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం విజయవంతం కావడానికి అధికారులు సమష్టిగా కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. 22ఎ కు సంబంధించి ఇప్పటి వరకు ఇచ్చిన జీవో లు, మెమోలతో కవర్ కానీ అంశాలు ఏమైనా ఉంటే పరిశీలించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి అధికారులను ఆదేశించారు.

















