ఇర్కోడ్ లిఫ్ట్ పనులు పూర్తి చేయండి

స‌ర్కార్ ను డిమాండ్ చేసిన హ‌రీశ్ రావు

hellotelugu-HarisshRao

హైద‌రాబాద్ : సిద్దిపేట జిల్లాలోని మల్లన్న సాగర్ ద్వారా మూడు నియోజకవర్గాలకు సాగు నీరు అందించే ఇర్కోడ్ లిఫ్ట్ పథకాన్ని పూర్తి చేయాల‌ని ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. ఇర్కోడ్ లిఫ్ట్ పూర్తి అవుతే 17వేల ఎకరాలకు సాగు నీరు అందుతుంద‌న్నారు. దీని ద్వారా 21 గ్రామాలకు, 10 వేల మంది రైతు కుటుంబాలకు మేలు జరుగుతుంద‌ని చెప్పారు. ఈ సంద‌ర్బంగా రాష్ట్ర భారీ నీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డికి లేఖ రాశాన‌ని తెలిపారు. హ‌రీశ్ రావు ఇవాళ మీడియాతో మాట్లాడారు.

సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల్లోని బీడు భూములను సస్య శ్యామలం చేయడానికి కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా శ్రీ కొమురవెల్లి మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మించడం జరిగిందన్నారు. అందులో భాగంగా ఇర్కోడ్ లిఫ్ట్ నిర్మాణ పనులు చేప‌ట్టామ‌ని, కానీ తాము అధికారంలోకి రాక పోవ‌డంతో ప‌నులు ఆగి పోయాయ‌ని ఆవేద‌న చెందారు.

ఆగి పోయిన ఎత్తిపోత‌ల ప‌థ‌కం ప‌నుల‌ను వెంట‌నే చేప‌ట్టాల‌ని కోరారు హ‌రీశ్ రావు. మల్లన్న సాగర్ రిజర్వాయర్ పరిధిలో 2020 సంవత్సరం నుండి కొత్త ఆయకట్టును సృష్ఠించుకున్నామని. అయితే సిద్దిపేట, దుబ్బాక, గజ్వెల్ నియోజకవర్గాల్లో రిజర్వాయర్ మట్టానికి ఎత్తులో ఉన్న 17,377 ఎకరాల భూమికి సాగు నీరు అందడం లేదని అన్నారు. దీనికోసం త‌మ‌ బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇర్కోడు లిఫ్ట్ పనులను చేపట్టామని పేర్కొన్నారు.. 2023 వరకు 95శాతం పనులు పూర్తి చేశాం. మరో 5 శాతం పంపు హౌస్ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని అన్నారు హ‌రీశ్ రావు.

Exit mobile version