అమరావతి : పోలవరం ప్రాజెక్టు కారణంగా భూములు కోల్పోయిన రైతులు, నిర్వాసితులకు మూడో విడత కింద రూ. 306.61 కోట్లు అందించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఈ సందర్బంగా సీఎం క్యాంప్ కార్యాలయంలో నిర్వాసితులతో ముచ్చటించారు. వారి ఇబ్బందుల గురించి తెలుసుకున్నారు. కూటమి సర్కార్ అన్ని విధాలుగా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. సర్ కాటన్ జయంతి రోజున పోలవరం నిర్వాసితులతో సమావేశం కావడం ఆనందంగా ఉందన్నారు సీం. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద నిధులు ఇవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. సంక్రాంతి, దీపావళి, ఉగాది ఇలా పండుగలకు పోలవరం నిర్వాసితులకు నిధులు అందిస్తున్నాం అని చెప్పారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కమిట్మెంట్ ఉందన్నారు చంద్రబాబు నాయుడు. నిర్వాసితుల మీద అభిమానం ఉందన్నారు. ప్రాజెక్టుకు భూములిచ్చిన రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టపోకూడదు.. ఇబ్బందులు పడకూడదనేదే నా ఆలోచన అని స్పష్టం చేశారు సీఎం. నిర్వాసితులకు ఇబ్బంది లేకుండా చేసేందుకే పోలవరం జిల్లా ఏర్పాటు చేశాం అన్నారు. టెక్నాలజీ అనుసంధానం చేసి ప్రతీ కుటుంబ ఆదాయం పెంచుతామని భరోసా ఇచ్చారు. గిరిజన నియోజకవర్గాలైన పోలవరం, రంప చోడవరం నియోజకవర్గాలను అన్ని విధాలా తీర్చిదిద్దుతాం అన్నారు. పోలవరం ప్రాజెక్టు అనుకున్న సమయానికి పూర్తవుతుందని ప్రకటించారు నారా చంద్రబాబు నాయుడు.
నిర్వాసితుల్లో ఏ ఒక్కరికి అన్యాయం జరగదన్నారు సీఎం. ప్రాజెక్టు, టౌన్ షిప్, ఇండస్ట్రీ…ఇలా ఏం వచ్చినా భూములు త్యాగాలు చేసేది రైతులేనని అన్నారు. వారసత్వంగా వచ్చిన భూములు పోతే బాధ పడతారని, నిర్వాసితులకు అన్యాయం జరగనివ్వను అని స్పష్టం చేశారు సీఎం. గోదావరి కావేరి నదుల అనుసంధానం జరుగుతుందన్నారు.
