న్యూఢిల్లీ : కోకో కోలా స్పాన్సర్ చేస్తున్న ఫిఫా వరల్డ్ కప్ 2026 ట్రోఫీని న్యూఢిల్లీలోని తాజ్ హోటల్ లో అధికారికంగా ఆవిష్కరించారు కేంద్ర యువజన, క్రీడా శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ట్రోఫీని తన చేతుల మీదుగా ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు. తన జీవితంలో మరిచి పోలేనని పేర్కొన్నారు. ఫిఫా వరల్డ్ కప్ కు పెద్ద ఎత్తున ఆదరణ ఉందన్నారు. భారత దేశంలో క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో, క్రీడలు జాతీయ ప్రాధాన్యతగా అవతరించాయని చెప్పారు. ముఖ్యంగా మన యువతలో క్రమశిక్షణ, విశ్వాసం, వ్యక్తిత్వాన్ని పెంపొందించడానికి క్రీడలు ఒక శక్తివంతమైన సాధనమని తాము విశ్వసిస్తామని చెప్పారు.
అంతే కాకుండా 2047 నాటికి భారతదేశాన్ని ప్రపంచంలోని అగ్ర ఐదు క్రీడా దేశాలలో ఒకటిగా ఉంచాలనే మా ఆకాంక్షతో ఫిఫా ప్రపంచ కప్ ట్రోఫీ టూర్ బలంగా ప్రతిధ్వనిస్తుందని అన్నారు మన్సుఖ్ మాండవీయ. విక్షిత్ భారత్ (అభివృద్ధి చెందిన భారతదేశం)గా మారే దిశగా ముందుకు సాగుతున్నప్పుడు, క్రీడలు దేశ నిర్మాణం,యువత సాధికారతకు కీలకమైన స్తంభంగా నిలుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కోకా-కోలా ఇండియా, నైరుతి ఆసియా అధ్యక్షుడు సంకేత్ రే మాట్లాడుతూ భారతదేశంలో క్రీడలు ఒక నిర్వచించే దశలోకి ప్రవేశిస్తున్నాయి, విస్తృత భాగస్వామ్యం, బలమైన మౌలిక సదుపాయాలు, పెరుగుతున్న ప్రపంచ సౌలభ్యం ఇందుకు దోహద పడుతుందన్నారు.
