అమరావతి : వ్యవసాయానికి కూటమి సర్కార్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు. రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని బకాయిలు పూర్తి చేశామన్నారు. తాజాగా ఆర్థిక మంత్రి ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో అత్యధికంగా సాగు రంగానికి కేటాయించడం పట్ల ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. పంట పండించే రైతుకు స్థిరమైన ఆదాయ భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేశారు. దీనికి ఉద్యాన పంటలే కీలకం అన్నారు. సంప్రదాయ సాగు నుంచి అధిక ఆదాయం ఇచ్చే ఉద్యాన పంటల వైపు రైతులను ప్రోత్సహించడంలో ఉద్యానశాఖ నిబద్ధతతో పనిచేస్తోందని చెప్పారు కింజారపు అచ్చెన్నాయుడు. ఉత్పత్తి, ఉత్పాదకత, నాణ్యత పెంపుపై దృష్టి సారించి ఉద్యాన రంగాన్ని ప్రభుత్వం ప్రాధాన్య శాఖగా గుర్తించిందన్నారు.
రాష్ట్ర GSDPకి ఉద్యాన శాఖ రూ. 1,52,952 కోట్లు సమకూరుస్తోందని ప్రకటించారు. 2026–27 లో ఉద్యానశాఖకు రూ. 1,123.86 కోట్ల బడ్జెట్ ను ప్రతిపాదిస్తూ, రైతు సంక్షేమం, రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ఉద్యాన రంగాన్ని అభివృద్ధి చేస్తున్నాం అన్నారు. సాంప్రదాయంగా పట్టు ఉత్పత్తిచేసే రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ రెండవ అతి పెద్ద రాష్ట్రంగా ఉందని చెప్పారు అచ్చెన్నాయుడు. రాష్ట్రంలో 1.52 లక్షల ఎకరాల్లో పట్టు సాగు చేస్తున్నారని తెలిపారు. 2025-26లో 90 శాతం రాయితీతో షెడ్యూల్డ్ తెగల పట్టు రైతులకు 2.98 కోట్ల రూపాయలు, షెడ్యూల్డ్ కులాల పట్టు రైతులకు 1.92 కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు. 2026-27లో పట్టు పరిశ్రమకు 95.87 కోట్ల రూపాయలు బడ్జెట్ లో ప్రతిపాదించడం జరిగిందన్నారు.
