హైదరాబాద్ : టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ పాటిల్ దూకుడు పెంచారు. ఆయన ఆకస్మిక తనిఖీలతో హడలెత్తిస్తున్నారు. తనిఖీలలో భాగంగా హబ్సిగూడ కస్టమర్ సర్వీస్ సెంటర్ , మౌలాలి సేవా కేంద్రం, మౌలాలి సబ్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.కస్టమర్ సర్వీస్ సెంటర్‌లో వినియోగదారులకు అందుతున్న సేవలు, ఫిర్యాదుల నమోదు, పరిష్కార విధానాలను పరిశీలించారు సీఎండీ. ప్రతి ఫిర్యాదును నిర్దేశిత గడువులో పరిష్కరించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరా, బిల్లింగ్, మీటర్లు, కొత్త సేవా కనెక్షన్లు తదితర అంశాలకు సంబంధించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం కింద దరఖాస్తుల స్వీకరణ, నెట్ మీటర్ల మంజూరు, పెండింగ్ కేసుల పరిష్కారం, కొత్త విద్యుత్ కనెక్షన్లు, అదనపు లోడ్ దరఖాస్తుల ప్రాసెసింగ్ తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించారు.
ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం కింద నెట్ మీటర్ల జారీ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని, అర్హులైన వినియోగదారులకు ఎటువంటి జాప్యం లేకుండా నెట్ మీటర్లను విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. దరఖాస్తుల పరిశీలన నుంచి ఆమోదం, నెట్ మీటర్ విడుదల, గ్రిడ్ కనెక్టివిటీ వరకు అన్ని ప్రక్రియల్లో పూర్తి పారదర్శకత పాటించాలని స్పష్టం చేశారు సీఎండీ. అనంతరం మౌలాలి సబ్‌స్టేషన్‌ను సందర్శించిన సీఎండీ, అక్కడి నిర్వహణ, భద్రతా ప్రమాణాలు, విద్యుత్ సరఫరా వ్యవస్థ పనితీరును పరిశీలించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా ముందస్తు నిర్వహణ చర్యలు చేపట్టాలని, వినియోగదారులకు నాణ్యమైన , నిరంతరాయ విద్యుత్ అందించేందుకు అప్రమత్తంగా పని చేయాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా సీఎండీ సంబంధిత అధికారులు, సిబ్బందితో సమావేశమై క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలు, పెండింగ్ దరఖాస్తుల స్థితి, సేవల మెరుగుదలపై పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించడంలో టీజీఎస్పీడీసీఎల్ ఆదర్శంగా నిలవాలని సూచించారు.
