అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకున్న అర్నబ్ తుపాను ప్రభావంపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాకు లేఖ రాశారు సీఎం చంద్రబాబు నాయుడు. తఫాను తీవ్రత కారణంగా రాష్ట్రంలో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నట్టు లేఖలో పేర్కొన్నారు. త్వరితగతిన తుఫాను నష్టం పై అంచనాకు కేంద్ర బృందాలను పంపాలని కోరారు. తుఫాను సహాయక చర్యల్లో 14 జిల్లాల్లో 16 ఎన్డీఆర్‌ఎఫ్, 11 ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను నియమించినట్టు స్పష్టం చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో 28 వేల మందికి పైగా ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించామని వెల్లడించారు. ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యల కారణంగా ఇప్పటి వరకు ప్రాణనష్టం నమోదు కాలేదని సీఎం తెలిపారు ఈ సందర్బంగా. ప్రాథమిక అంచనా ప్రకారం 180 ఇళ్లు దెబ్బతిన్నాయని, రహదారులపై 220కి పైగా చెట్లు కూలి పోయాయని పేర్కొన్నారు సీఎం.
తీర ప్రాంతాల్లో చాలా చోట్ల రహదారులు ధ్వంసం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని లేఖలో వెల్లడించారు. విద్యుత్ పునరుద్ధరణ పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన చేపట్టినట్టు స్పష్టం చేశారు. భారీ వర్షాల కారణంగా ప్రాథమిక అంచనా ప్రకారం సుమారు 70,900 హెక్టార్లలో వరి పంటకు నీట మునిగినట్టు తెలిపారు. ప్రాథమిక సమాచారం మేరకు ఇప్పటి వరకూ 10,450 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లిందని అన్నారు. కోనసీమ, కాకినాడ, తూర్పు, పశ్చిమ గోదావరి, అనకాపల్లి, కృష్ణా జిల్లాల్లో తుపాను ప్రభావం అధికంగా ఉందని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కోనేలా కంట్రోల్ రూమ్‌లు, రాష్ట్ర అత్యవసర ఆపరేషన్స్ కేంద్రం నిరంతరం పని చేస్తున్నాయని తెలిపారు. ప్రజలకు సహాయ చర్యలు, విద్యుత్, తాగునీటి పునరుద్ధరణపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టిందన్నారు. తుఫాను నష్టంపై సమగ్ర అంచనా అనంతరం కేంద్రానికి నివేదిక సమర్పిస్తామని పేర్కొన్నారు.
