హైదరాబాద్ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు నీటి ఎద్దడి గురించి. ప్రత్యేకించి ఎల్ నినో ప్రభావం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా నీటి కొరత ఏర్పడిందని, దీనిని అధిగమించేందుకు చర్యలు తీసు కుంటున్నామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తాగునీటి సరఫరా విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రిజర్వాయర్లలో నీటి నిల్వ స్థాయిలను నిరంతరం పర్యవేక్షించాలని ఆయన పేర్కొన్నారు.
హైదరాబాద్ నగర పరిధిలో భూగర్భ జలాలు, మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణం , శుద్ధి చేసిన నీటి వినియోగంపై ముఖ్యమంత్రి ఎంసీహెచ్ఆర్డీ భూమి పెవిలియన్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ‘ఎల్ నినో’ ప్రభావం , వర్షపాతం లోటును దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్తు అవసరాల కోసం నగర పరిధిలోని మురుగునీటి శుద్ధి కేంద్రాలు 100% సామర్థ్యంతో పనిచేసేలా చూడాలని సీఎం ఆదేశించారు. సచివాలయం, ముఖ్యమంత్రి కార్యాలయం , ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు , ఇతర ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లోని పచ్చదనాన్ని కాపాడేందుకు, అలాగే ఇతర అవసరాల కోసం శుద్ధి చేసిన నీటినే ఉపయోగించాలని రేవంత్ రెడ్డి సూచించారు. బహిరంగ పార్కులు , రోడ్ల శుభ్రత కోసం కూడా ఇదే నీటిని వాడాలని ఆయన పేర్కొన్నారు.
భవన నిర్మాణ పనుల్లో కేవలం శుద్ధి చేసిన నీటినే వాడాలనే నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. ప్రైవేట్ ఎస్టీపీలను ప్రోత్సహించాలని, డేటా సెంటర్లకు కూడా శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయాలని ఆయన ఆదేశించారు. ఎస్టీపీల నిర్వహణలో సౌరశక్తిని (సోలార్ పవర్) ఉపయోగించే అవకాశాలను పరిశీలించాలని రెడ్కో ఉన్నతాధికారులకు సూచించారు. ఎస్టీపీలో నీటి శుద్ధి ప్రక్రియ కోసం అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలను పాటించాలని చెప్పారు. నీటి నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు. ప్రతి మురుగునీటి శుద్ధి కేంద్రం వద్ద ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని, అన్ని కేంద్రాలను ‘కమాండ్ కంట్రోల్ సెంటర్’తో అనుసంధానించి నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.
ఈ కేంద్రాల పనితీరును హైదరాబాద్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. శుద్ధి చేసిన నీటిని సరఫరా చేసే ట్యాంకర్లను ట్రాక్ చేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలని, దీని వినియోగంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. శుద్ధి చేసిన నీటి వినియోగానికి సంబంధించి ఒక ప్రత్యేక టోల్-ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నవంబర్ 1వ తేదీ నుండి ఎస్‌టీపీ నిర్వహణ , శుద్ధి చేసిన నీటి వినియోగానికి సంబంధించిన ఆదేశాలను అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
