అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో అటవీ శాఖ వ్యవహరిస్తున్న తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మీ శాఖకు సంబంధించి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయని, పనితీరు మార్చుకోక పోతే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. పోలీసు డిపార్ట్మెంట్ పీపుల్ ఫ్రెండ్లీగా మారి పోయిందన్నారు. కానీ ఫారెస్టు డిపార్టుమెంట్ పీపుల్ ఫ్రెండ్లీగా లేరని మండిపడ్డారు. మారాల్సిన అవసరం ఉందన్నారు. అటవీ శాఖ గ్రీన్ కవర్ పెంచే అంశంపై దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. బయోడైవర్సిటీకి వెళ్లాలని సూచించారు. ప్రజలు ఆహ్లాదంగా పర్యటించేందుకు ఉపయుక్తంగా పరిస్థితులు మారాల్సిన అవసరం ఉందన్నారు. ఫారెస్టు అధికారులు జిల్లా కలెక్టర్ కిందే పని చేయాలని గుర్తుంచు కోవాలని అన్నారు. కలెక్టర్లు చెబుతున్నా… అటవీ అధికారులు పట్టించు కోవడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు.
నిబంధనలకు అనుగుణంగానే పర్యావరణహిత ప్రాజెక్టులకు సహకరించాలని ఆదేశించారు. సర్వే చేస్తున్న సమయంలో ప్రైవేటు, అటవీ, ఎండోమెంట్ తదితర క్లాసిఫికేషన్ల ప్రకారం రిజర్వు ల్యాండ్ గుర్తించాలని అన్నారు. కొందరు అటవీ శాఖ అధికారుల ఇంప్రాక్టికల్ థింకింగ్ వల్ల ఇబ్బందులు వస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం. గిరిజన ప్రాంతాల్లో కూడా మౌలిక సదుపాయాలు కల్పించకపోతే ఎలా అని ప్రశ్నించారు. నడకదారిన శ్రీశైలం వస్తున్న భక్తులను అటవీ శాఖ అధికారులు అడ్డుకున్నారని ఫైర్ అయ్యారు. ఆ తర్వాత రోజే తొక్కిసలాట అయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. బద్వేలులోనూ అటవీ శాఖ ఇదే తరహాలో వ్యవహరించడం పట్ల సీరియస్ అయ్యారు.
ఏమైనా ఇబ్బందులుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకు రావాలన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టేలా… కార్యక్రమాలకు ఆటంకం కలిగేలా వ్యవహరించ కూడదని హితవు పలికారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా వినూత్న ఆలోచనలు చేయాలన్నారు. స్టార్టప్ కంపెనీలు, యువతలో ఉన్న ఇన్నోవేషన్లను ప్రొత్సహించేందుకు ఆర్టీఐహెచ్( రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్) అధికారులు పని చేయాలని ఆదేశించారు సీఎం. ఆర్టీఐహెచ్‌ను మరింత యాక్టీవ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. వినూత్నంగా ఆలోచిస్తారు కాబట్టే… RTIHకు యువ అధికారులను నియమించాం అని తెలిపారు.

















