చెన్నై : తమిళనాడు డీఎంకే సర్కార్ ఖుష్ కబర్ చెప్పింది. సీఎం ఎంకే స్టాలిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన జర్నలిస్టులకు తీపి కబురు చెప్పడంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. త్వరలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలోని జర్నలిస్టుల నెలవారీ పెన్షన్‌ను గణనీయంగా పెంచుతూ ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు జర్నలిస్టులకు నెలకు రూ .12,000 వచ్చేవి. ఇక నుంచ పెన్షన్ ను మరో 3 వేలు అదనంగా కలిపి ఇక నుంచి రూ. 15,000 పెన్షన్ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సీఎస్ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.
మరణించిన జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు (ఆధారపడిన వారికి) ఇచ్చే కుటుంబ పెన్షన్‌ను రూ. 6,000 నుండి రూ. 7,500కు పెంచారు. గుర్తింపు కార్డులు (Accredited Identity Cards) కలిగిన జర్నలిస్టులందరినీ ‘ముఖ్యమంత్రి సమగ్ర వైద్య బీమా పథకం’ పరిధిలోకి తీసుకు రావాలని సీఎం ఎంకే స్టాలిన్ ఆదేశించారు.
కొత్తగా ఏర్పాటు చేసిన సహకార గృహ నిర్మాణ సంఘం ద్వారా, చెంగల్పట్టు జిల్లాలో జర్నలిస్టులకు ఇంటి స్థలాలను కేటాయించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ప్రకటించారు. సచివాలయంలో.. ముఖ్యమంత్రి , చెన్నై ప్రెస్ క్లబ్ ప్రతినిధుల మధ్య జరిగిన సమావేశం అనంతరం ఈ నిర్ణయాలు తీసుకున్నారు.

















