తమిళనాడు : తమిళనాడు రాష్ట్రంలో సోమవారం విడుదలైన శాసన సభ ఎన్నికల ఫలితాలు ఊహించని రీతిలో వెల్లడయ్యాయి. ఆశ్చర్యకరంగా ప్రముఖ నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. జనం జేజేలు పలికారు. ప్రధానంగా యువతీ యువకులు, మహిళలు గంప గుత్తగా 70 శాతానికి పైగా టీవీకై వైపు మొగ్గు చూపారు. మరో వైపు ఏ పార్టీతోనూ తమకు మద్దతు అవసరం లేదని ఇప్పటికే ప్రకటించారు. సుదీర్గ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు స్టాలిన్ చేతిలో కీలుబొమ్మగా మారిందని ఆరోపించారు విజయ్.
అతిరథ మహారథులు సైతం టీవీకే కొట్టిన దెబ్బకు ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న డీఎంకే పార్టీ చీఫ్ ఎంకే స్టాలిన్ ఓటమి పాలయ్యారు. ఇది ఆ పార్టీ శ్రేణులను విస్మయానికి గురి చేసింది. కొలత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో బరిలో నిలిచారు. 2011 నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఇవాళ వెలువడిన ఫలితాల్లో టీవీకే పార్టీ అభ్యర్థి వీఎస్ బాబు చేతిలో స్టాలిన్ పరాజయం పాలయ్యారు. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తమిళనాడు నాలుగవ సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఆయన నిలిచారు. అయితే గెలుపొందిన బాబు ఒకప్పుడు డీఎంకే పార్టీ చీఫ్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. ఉత్తర చెన్నై జిల్లా కార్యదర్శిగా కూడా సేవలు అందించారు. 2006లో పురసవాక్కం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
















