న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో బిజీగా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి బుధవారం ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గేను తన నివాసంలో కలిశారు. ఈ సందర్బంగా తెలంగాణ సర్కార్ 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇండియాలో ఎక్కడా లేని విధంగా భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ 2025ను నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా డిసెంబర్ 8,9వ తేదీలలో నిర్వహించే సమ్మిట్ కు ముఖ్య అతిథులుగా రావాలని కోరారు.
ప్రభుత్వం పరంగా అధికారికంగా ఇన్విటేషన్ ను అందజేశారు సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. మల్లికార్జున ఖర్గేను కలిసిన అనంతరం నేరుగా అగ్ర నాయకుడు, ఎంపీలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను వారి నివాసంలో కలిశారు. ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఈ సమ్మిట్ కు ముఖ్య అతిథులుగా హాజరు కావాలని కోరారు సీఎం. రాహుల్, ప్రియాంకలను కలిసిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాము ఇచ్చిన ఆహ్వానానికి సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులను ఆహ్వానించామన్నారు. దాదాపు 5 వేల మందికి పైగా వస్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో భారత్ ఫ్యూచర్ సిటీ దేశానికి రోల్ మోడల్ కానుందన్నారు.
















