హైదరాబాద్ : గురు శిష్యులుగా పేరు పొందిన ఏపీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎ. రేవంత్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారారు. క్రిమినల్ కేసుల పరంగా చూస్తే నెంబర్ వన్ గా ఉన్నారు రేవంత్ రెడ్డి. ఇక తన గురువు చంద్రబాబు నాలుగో స్తానంలో ఉండడం విశేషం. ఈ విషయాన్ని ప్రముఖ సంస్థ ఏడీఆర్ వివరాలు వెల్లడించింది. అత్యంత ధనవంతులు, అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్న సీఎంల జాబితాను ప్రకటించింది. మనోడు 89 క్రిమినల్ కేసులతో ప్రథమ స్థానంలో నిలిచాడు. ఆ 89 కేసుల్లో 72 కేసులు తీవ్రమైన ఐపీసీ (IPC) సెక్షన్లకు సంబంధించినవని నివేదిక వెల్లడించింది. 19 క్రిమినల్ కేసులతో చంద్రబాబు నాయుడు నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇక రూ. 1,413 కోట్ల ఆస్తులతో కర్ణాటక సీఎం డీకే శివకుమార్ ప్రథమ స్థానంలో ఉండగా రూ. 931 కోట్ల ఆస్తులతో చంద్రబాబు నాయుడు రెండో స్థానంలో నిలిచాడు.
రూ. 648 కోట్ల ఆస్తులతో తమిళనాడు సీఎం విజయ్ మూడో స్థానంలో ఉన్నాడు. రూ. 30 కోట్ల ఆస్తులతో రేవంత్ రెడ్డి 8వ స్థానంలో కొనసాగుతున్నాడు. విచిత్రం ఏమిటంటే ధనవంతుల జాబితాలలో దక్షిణాదికి చెందిన సీఎంలే టాప్ లో ఉండడం విశేషం. దేశంలోని 31 మంది ముఖ్యమంత్రుల ఎన్నికల అఫిడవిట్ల ఆధారంగా వీటిని వెల్లడించినట్లు ఏడీఆర్ తెలిపింది. దేశంలోని 28 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన మొత్తం 31 మంది ముఖ్యమంత్రుల ప్రకటిత ఆస్తుల మొత్తం విలువ రూ.3,660 కోట్లుగా ఉంది. అతి తక్కువ ఆస్తులు ప్రకటించిన ముఖ్యమంత్రుల జాబితాలో జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా రూ.55 లక్షలతో తొలి స్థానంలో ఉండగా.. పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి రూ.85 లక్షలతో రెండో స్థానంలో.. రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ సుమారు రూ.1 కోట్ల ఆస్తులతో మూడో స్థానంలో నిలిచారు. ఈ నివేదికలో ఎక్కువ చర్చకు దారితీసిన అంశం ముఖ్యమంత్రులపై నమోదైన క్రిమినల్ కేసులే. మొత్తం 31 మంది సీఎంలలో 14 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఏడీఆర్ వెల్లడించింది


















