అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన వివిధ శాఖల పనితీరుపై ప్రత్యేకంగా సమీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా పలు సూచనలు చేశారు సీఎం. వివిధ శాఖల సమర్థత పెరిగేలా, మెరుగైన సేవలు అందించేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్టీజీఎస్, పబ్లిక్ పాజిటివ్ పర్షెప్సన్‌పై క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ నెల నుంచి కనీసం 80 శాతం నుంచి 90 శాతం తగ్గకుండా పబ్లిక్ పర్షెప్సన్ ఉండాలని అధికారులకు స్పష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు. పెన్షన్ల పంపిణీ, దీపం పథకం కింద ఇస్తున్న గ్యాస్ సిలిండర్ల డెలివరీ, స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఆర్టీసీ బస్సు సర్వీసులు బాగున్నాయి. అయితే పుంగనూరు, వెంకటగిరి, పెనుకొండ, ప్రొద్దుటూరు, ఎమ్మిగనూరు, శ్రీకాళహస్తి బస్ స్టేషన్‌లో తాగునీరు, టాయిలెట్స్, ఫ్యాన్స్, సీటింగ్ ఏరియాపై ప్రయాణికుల నుంచి అసంతృప్తి ఉందని సీఎం చెప్పారు.
అందుకే మొత్తం రాష్ట్రంలోని అన్ని బస్ స్టేషన్‌లలో టాయిలెట్లు మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశించారు నారా చంద్రబాబు నాయుడు. రిజిస్ట్రేషన్ శాఖలో స్లాట్ బుకింగ్, డిజిటల్ సేవలు, సిబ్బంది ప్రవర్తనపై సంతృప్తి వ్యక్తమైందని అన్నారు. అవినీతికి తావు లేకుండా రాష్ట్రంలోని మొత్తం 295 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నిజాయితీ కలిగిన అధికారులకే అవకాశం ఇవ్వాలని సీఎం ఆదేశించారు. వాట్సప్ మనమిత్ర సేవలు వినియోగించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. నూటికి నూరు శాతం వాట్సప్ సేవల వినియోగం జరగాలని సీఎం స్పష్టం చేశారు. లేక పోతే చర్యలు తప్పవన్నారు.
