అమరావతి : సీఎం నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లకు బిగ్ టాస్క్ ఇచ్చారు. ఓర్వకల్లులో పారిశ్రామిక క్లస్టర్ రూపకల్పన చేశామని, ఇప్పుడు ఎయిర్ పోర్టు లాంటి మౌలిక సదుపాయాలు కూడా వచ్చాయన్నారు. భవిష్యత్తులో ఓ మేజర్ పారిశ్రామిక హబ్ గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కడప జిల్లాలో కొప్పర్తి కూడా ఆ పారిశ్రామిక క్లస్టర్ గా తయారు కావాలని స్పష్టం చేశారు సీఎం. ఇదే క్రమంలో పెట్టుబడులపై జిల్లాల్లో కూడా సమావేశాలు నిర్వహించాలని అన్నారు. పెట్టుబడులు రాబట్టేందుకు కలెక్టర్లు చొరవ తీసుకోవాలని కుండ బద్దలు కొట్టారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంపై జిల్లాల వారీగా ర్యాంకులిస్తామని ప్రకటించారు సీఎం. 2019-24లో రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి ఎవ్వరూ ముందుకు రాలేదన్నారు అమర్ రాజా కంపెనీ తిరుపతిలో కార్పోరేట్ ఆఫీస్ పెట్టిందని, వారిని గత పాలకులు పారిపోయేలా చేశారని ఆవేదన చెందారు.
2014-19లో పరిశ్రమలకు ఇచ్చిన భూములను గత ప్రభుత్వం వేరే అవసరాలకు వాడేసిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏపీని బెంగళూరుకు పోటీగా తీర్చిదిద్దామని చెప్పారు సీఎం. మోస్ట్ లివబుల్ సిటీగా హైదరాబాద్ ను తీర్చిదిద్దామని, ఇది తన ఘనతేనని పేర్కొన్నారు. ఎకో సిస్టం కల్పించామని,ఇప్పుడు ఆ ఫలితాలు హైదరాబాద్ అనుభవిస్తోందన్నారు. ఇప్పుడు రాష్ట్రం మొత్తం అదే తరహా ఎకో సిస్టం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏదైనా జిల్లాల్లో పరిశ్రమలు రాకుంటే ఆ జిల్లాల్లో టూరిజం ప్రమోట్ చేయాలన్నారు. లేదా ఐటీని ప్రమోట్ చేయాలి… ఎంఎస్ఎంఈలు ప్రమోట్ చేయాలి.. అగ్రికల్చర్ ప్రమోట్ చేయాలి. ఇలా ఏదో ఒక రంగంలో ఆయా జిల్లాలకున్న ప్రత్యేకతలను, అనుకూలతలను దృష్టిలో పెట్టుకుని ఆయా రంగాల్లో అభివృద్ధి చేయాలని స్పష్టం చేశారు.















