చెన్నై : తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ తాను గట్స్ ఉన్నోడిని మరోసారి నిరూపించుకున్నారు. ప్రజలే తనకు ముఖ్యమని, వారికి ఇబ్బంది కలిగించే ఏ పనీ చేపట్టనని ఇప్పటికే ప్రకటించారు. తాజాగా సోమవారం రాష్ట్ర శాసన సభ వేదికగా సంచలన ప్రకటన చేశారు సీఎం. ఈ మేరకు
చెన్నై శివార్లలోని పరందూర్‌లో ప్రతిపాదించిన రెండవ విమానాశ్రయం ప్రాజెక్టును రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలకు చెందిన నాయకులను, ఈ ప్రాజెక్టుతో కోట్లు వెనకేసుకుందామని ఆశించిన కాంట్రాక్టర్లు, వ్యాపారులకు కోలుకోలేని షాక్ ఇచ్చారు సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్.
ప్రజల నుండి ఎటువంటి వ్యతిరేకత లేని ప్రాంతంలో కొత్త విమానాశ్రయాన్ని ప్రతిపాదించనున్నట్లు ముఖ్యమంత్రి విజయ్ స్పష్టం చేశారు. అన్నపూర్ణై సూపర్ సిక్స్ పథకం కింద జనవరి 14న వచ్చే పొంగల్ పండుగ నుండి తమిళనాడులోని ప్రతి ఇంటికి ఉచిత సిలిండర్లు అందించనున్నట్లు తీపికబురు చెప్పారు. మూడు సిలిండర్లకు సరిపడా మొత్తాన్ని తమిళనాడు ప్రభుత్వం నేరుగా వినియోగదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తుందని ప్రకటించారు. ఈ పథకం ద్వారా సుమారు 1 కోటి 30 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతాయన్నారు సీఎం. జనవరిలో రాబోయే పొంగల్ పండుగ నుండి ఈ పథకం అమలు చేయబడుతుందన్నారు. దీని కోసం ఏటా సుమారు రూ. 4,000 కోట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు.
వార్షిక ఆదాయం రూ. 2.5 లక్షల కంటే తక్కువ ఉన్న కుటుంబాలు, చిన్న, సన్నకారు రైతు కుటుంబాలు, దివ్యాంగుల కుటుంబాలు , ఇతర బలహీన వర్గాలు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతాయని చెప్పారు.
