CM Chandrababu : అమరావతి – స్వచ్ఛ భారత్ అవార్డుల తరహాలోనే రాష్ట్రంలోనూ స్వచ్ఛత అవార్డులు అందజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) ఆదేశించారు. స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర సాధనకు వీలుగా స్థానిక సంస్థల మధ్య బలమైన పోటీ ఉండేలా కార్యాచరణ ఉండాలని పేర్కోన్నారు. దీనికోసం ఓ స్వతంత్ర సంస్థతో మూల్యాంకనం చేయించాలని స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయంలో స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమం పై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. స్వచ్ఛ భారత్ లో అవార్డులు సాధించిన విశాఖ, విజయవాడ, గుంటూరు, తిరుపతి, రాజమహేంద్రవరం కార్పోరేషన్లలో ఈ నెల 21 తేదీన ప్రత్యేక కార్యక్రమాలు చేప్టటాలని సీఎం ఆదేశించారు.
CM Chandrababu Announced ‘Swatchatha Awards’
థీమ్ ల వారీగా స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమాలు నిర్వహించాలని, అలాగే మున్సిపాలిటీల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం తగ్గేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అక్టోబరు 2 తేదీ నాటికి 17 కార్పోరేషన్లు, మున్సిపాలిటీల్లో పర్యావరణ హిత చర్యల్లో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లేకుండా కార్యాచరణ అమలు చేస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. అయితే బయో డీగ్రేడబుల్ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు స్వయం సహాయ సంఘాల ద్వారా బ్యాగులను తయారు చేయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. మరోవైపు ప్రభుత్వ కార్యాలయాలను కూడా ప్లాస్టిక్ ఫ్రీగా తయారు చేసేలా ప్రణాళిక రూపోందించాలన్నారు.
సర్క్యులర్ ఎకానమీ ద్వారా రాష్ట్రంలో వ్యర్ధాలు లేకుండా చూడటమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. దీని కోసం ఆయా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు కల్పించాలని సీఎం సూచించారు. తిరుపతి, అనకాపల్లి, కర్నూలు, అనంతపురం, సత్యసాయి, గోదావరి జిల్లాల్లో సర్క్యులర్ ఎకానమీ క్లస్టర్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. సర్క్యులర్ ఎకానమీకి అనుకూలమని కేంద్ర ప్రభుత్వం 11 రంగాలను గుర్తించిందని దీనికి అదనంగా మరిన్ని అంశాలను జోడించాలని సీఎం స్పష్టం చేశారు. ఆయా రంగాల వారీగా ఎన్ని యూనిట్లను సర్క్యులర్ ఎకానమీకి జోడించే అవకాశం ఉందో పరిశీలించాలని పేర్కోన్నారు.
Also Read : TTD Strong Focus : తిరుమల క్యాంటీన్ల ఈవోఐ గడువులలో మార్పు
















