అమరావతి : గత ప్రభుత్వం జారీ చేసిన పట్టాదారు పాస్ పుస్తకాల్లోని తప్పులను సరిదిద్దుతూ ప్రజా ప్రభుత్వం రైతులకు కొత్త పుస్తకాలను అందిస్తోంది. రైతుల సమక్షంలోనే రీ సర్వే చేసి వారి ఆమోదంతో పాస్ పుస్తకాలను ఇస్తోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతీ నెలా మీ భూమి-మీ హక్కు కార్యక్రమంలో భాగంగా నేరుగా ఆయనే రైతులతో సమావేశమై వారి సమక్షంలోనే అధికారులతో భూమి వివరాలను చదివించి పుస్తకాలను అందజేస్తున్నారు. సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం సిద్ధాంతంలో మీ భూమి-మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు.
జనవరి నుంచి ప్రభుత్వం రీ సర్వే నిర్వహించి పట్టాదారు పాస్ పుస్తకాలను అందిస్తోందని చెప్పారు. ఇప్పటి వరకు 6,688 గ్రామాల్లో రీ-సర్వే నిర్వహించినట్లు తెలిపారు. అందులో 6,459 గ్రామాలకు చెందిన 26.46 లక్షల మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను ప్రభుత్వం అందించినట్లు తెలిపారు సీఎం. వచ్చే 9 నెలల్లో మరో 10,357 గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేస్తామన్నారు. ఈ గ్రామాలకు సంబంధించి మొత్తం 67.32 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు ప్రభుత్వం పంపిణీ చేయనుందని ప్రకటించారు. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తొలిసారి బ్లాక్‌చైన్ ఆధారిత భూ రికార్డుల వ్యవస్థను ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు. ప్రతీ భూ యూనిట్‌కు శాశ్వత బ్లాక్‌చైన్ ఐడీ ఇస్తోందన్నారు. దీని వల్ల ఒకసారి నమోదైన సమాచారాన్ని ఎవరూ మార్చడానికి అవకాశం ఉండదని చెప్పారు. భూముల సర్వే ప్రారంభం నుంచి తుది రికార్డు వరకు ప్రతి దశలో ఈ-కేవైసీ తప్పని సరి చేసిందన్నారు. తొలుత రైతుకు డ్రాఫ్ట్ పుస్తకాన్ని అందించి… రైతు తన వివరాలను పరిశీలించుకుని ఈ-కేవైసీ ద్వారా ధృవీకరించిన తర్వాతే తుది పాస్ పుస్తకం ముద్రణకు వెళ్తోందని చెప్పారు చంద్రబాబు నాయుడు.
















