అమరావతి : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఖుష్ కబర్ చెప్పారు. ఈ మేరకు ఆయన కీలక ప్రకటన చేశారు. వచ్చే 2029 నాటికల్లా రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ ఇల్లు కట్టించే బాధ్యత తనదని ముఖ్యమంత్రి అన్నారు. ఇప్పటికే 3 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశామని, వచ్చే ఏడాది జూన్ కల్లా మరో 6 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో అందరి ఆకలి తీర్చేలా 204 అన్న క్యాంటీన్లు పని చేస్తున్నాయని చెప్పారు. యూనివర్సల్ హెల్త్ పాలసీని త్వరలో తీసుకు వస్తున్నామని తెలిపారు సీఎం. పేదలు, ధనికులు తేడా లేకుండా అందరికీ రూ.2.5 లక్షలు మేర ఆరోగ్య బీమా అందిస్తామని పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలోని 1.63 కుటుంబాలకు ఆరోగ్య భద్రత లభిస్తుందన్నారు.పేదలకు రూ 25 లక్షల వరకూ ఉచితంగానే వైద్యం అందిస్తామని తెలిపారు.సూపర్ జీఎస్టీ వల్ల పేద, మధ్య తరగతి వర్గాలకు ఉపయోగపడేలా ధరలు తగ్గి కొనుగోలు శక్తి పెరిగిందన్నారు నారా చంద్రబాబు నాయుడు. జీఎస్టీ తగ్గింపుతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం దాదాపు రూ.8 వేల కోట్లు తగ్గుతుందన్నారు. దీన్ని స్వాగతిస్తూ మనం శాసన సభలో తీర్మానం చేశామన్నారు.
కారణం పేద, మధ్యతరగతి ప్రజలకు రూ.8 వేల కోట్ల మేర ప్రయోజనం కలుగుతుంది అనేది మా ఆలోచన అని పేర్కొన్నారు. కొత్త శ్లాబుల వల్ల ప్రతి కుటుంబానికి ప్రతినెలా రూ.1000 -1500 వరకు ఆదా అవుతుందని సీఎం అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో కరెంటు చార్జీలు పెంచబోమని ప్రకటించారు. వీలైతే తగ్గించే చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి తెలిపారు. సమర్ధ నిర్వహణతో విద్యుత్ రంగాన్ని గాడిన పెట్టామన్నారు. గత ప్రభుత్వంలో 9 సార్లు కరెంటు రేట్లు పెంచి రూ. 32 వేల కోట్ల భారం ప్రజలపై వేశారని ఆరోపించారు. దేశ చరిత్రలో తొలి సారి ట్రూడౌన్ తో విద్యుత్ చార్జీల భారం తగ్గిస్తున్నామని తెలిపారు. నవంబర్ 13 నుంచి ట్రూ అప్ చార్జీలు యూనిట్ కు 13 పైసలు తగ్గుతాయని చెప్పారు. పిఎం కుసుమ్ స్కీంల భాగంగా రైతులకు, పిఎం సూర్యఘర్ కింద ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బీసీలకు గరిష్టంగా రూ. 98 వేలు సబ్సిడీ ఇస్తున్నామని చంద్రబాబు నాయుడు చెప్పారు.
















