విజయవాడ : మాజీ ఎంపీ విజయ సాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీపీఎస్సీ -డీఎస్సీ స్కాంపై తక్షణమే సీబీఐతో విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. విజయవాడ వేదికగా ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్త పార్టీని పెడుతున్నట్లు ప్రకటించిన విజయ సాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. యువతరానికి కావాల్సింద విద్య, ఉద్యోగం. ఉద్యోగాలు వచ్చే విద్య వారికి కావాలి. ఉద్యోగాలు రానటువంటి కోర్సులను విస్మరించాలి. మాన్యుఫ్యాక్చరింగ్ రంగాన్ని అభివృద్ధి చేయాలి. టీచర్లపై ఓవర్ బర్డన్ కూడా తగ్గించాలి. చదువు చెప్పటం వరకే వారిని పరిమితం చేయాలి. మేం అధికారంలోకి వస్తే అదే చేస్తాం అన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన ఏపీపీఎస్సీ స్కాంగానీ- ఈ ప్రభుత్వంలో జరిగిన డీఎస్సీ స్కాం గానీ.. రెండింటినీ నేను ఒప్పుకుంటాను. రెండింటిపై సీబీఐ విచారణ వేయాలని ప్రతిపక్షం అడుగుతుంది. ఈ రెండింటినీ సీబీఐకి ఇచ్చి, నిష్పాక్షికంగా విచారణ చేసి, తప్పు చేసిన వారిని శిక్షించాలని ఆయన కోరారు. ఏ రిక్రూట్ మెంటు అయినా పారదర్శకంగా జరగాలంటే యూపీపీఎస్సీ, ఏపీపీఎస్సీ తరహాలో, టీచర్ ఉద్యోగాలకు కూడా ఆంధ్రప్రదేశ్ టీచింగ్ సర్వీసెస్ ఏర్పాటు చేసి, వ్రాత పరీక్ష, ఇంటర్వూ పాస్ అయితేనే ఉద్యోగాలు కల్పిస్తాను అని ఎందుకు చెప్పలేక పోతున్నారు? అని నిలదీశారు విజయ సాయి రెడ్డి. మేం అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ టీచింగ్ సర్వీసెస్ ఏర్పాటు చేస్తాం అని ప్రకటించారు.
2014లోగానీ, 2019లోగానీ చంద్రబాబు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. ఈరోజు దాని గురించి మాట్లాడరు. నిరుద్యోగులను గాలికి వదిలేశారు. అధికారంలోకి వస్తే.. ఈ సమస్య పరిష్కారానికి, కేంద్రం ప్రతిపాదించినట్టుగా గ్రాడ్యుయేట్ బ్రిడ్జ్ అలవెన్స్, అంటే నిర్ణీత కాలం, యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అయి, బయటకు వచ్చిన ప్రతి ఒక్క నిరుద్యోగికి, నిర్ణిత కాలం నాలుగేళ్ళో, ఐదేళ్ళో అలవెన్స్ ఇచ్చే కార్యక్రమం చేస్తాం అన్నారు. ఉదాహరణకు పనికి ఆహార పథకం కూలీలకు ఉంది. నిరుద్యోగ యువతకు అటువంటి పథకాలేవీలేవు. వారికి ఉద్యోగాలు లేవు. యూనివర్సిటీల నుంచి బయటకు వచ్చి ఏం చేయాలో తెలియదు. వీరికోసం గ్రాడ్యుయేట్ బ్రిడ్జ్ అలవెన్స్ ఏర్పాటు చేస్తాం. విద్యకు సంబంధించి టీడీపీకి ఒక లక్ష్యం ఉంది.. అదేంటంటే, ప్రభుత్వ బడులను బలహీనం చేసి, నారాయణ, చైతన్యలను బలోపేతం చేయాలన్నదే చంద్రబాబు విధానం. 16 ఏళ్ళుగా చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అదే జరుగుతూ ఉంది. ఆయన హయాంలో ప్రభుత్వ బడులు మూసివేయడం జరిగింది. ప్రశ్నా పత్రాలు ఎలా లీక్ అవుతున్నాయి.
ఈ ప్రైవేట్ సంస్థలకే ఎందుకు ర్యాంకులు వస్తున్నాయి. ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివితే ర్యాంకులు ఎందుకు రావు అనే భావన ఎందుకు ఉంది. దీనికి కారకులు ఎవరు?. మేం అధికారంలోకి వస్తే.. ప్రభుత్వ బడులకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చి అభివృద్ధి చేస్తాం అని ప్రకటించారు. నీటి పారుదల, సోలార్ విద్యుత్, పెట్రో, డీజిల్ ధరలు తగ్గింపు- నిత్యావసర సరుకుల ధరలు తగ్గింపు, ప్రతి ఇంటికి ఉచిత విద్యుత్, రైతుకు రెండు పంటలకు ఉచిత విద్యుత్, లోన్ యాప్ లకు చెక్ పెట్టి, వారిని చట్ట పరిధిలోకి తీసుకు రావడం, ప్రజల ఆదాయాన్ని ఎలా పెంచడం, 66 శాతం సీట్లను 25-40 ఏళ్ళ మధ్య యువతకు కేటాయించడం జరుగుతుందన్నారు. ,మిగతా 34 శాతం సీనియర్లు, రాజకీయ అనుభవం కలిగిన సీనియర్లకు అవకాశం కల్పించడమే మా పార్టీ అభిమతం . ఎందుకంటే, 40 ఏళ్ళ లోపు యువత దేశంలో 66 శాతం ఉన్నారు. అందులో 33 శాతం యువ మహిళలకు ప్రాధాన్యం ఉంటుందన్నారు.

















