అమరావతి : గత ప్రభుత్వం అధిక వడ్డీలతో చేసిన రుణాల వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గత పాలకుల వల్ల రాష్ట్రానికున్న బ్రాండ్ దెబ్బ తినడంతో ఈ పరిస్థితి వచ్చిందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే రుణాలు, వడ్డీలను రీ-షెడ్యూల్ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని సీఎం ప్రకటించారు. బుధవారం రాష్ట్ర సచివాలయం ఐదో బ్లాకులో మంత్రులు, కార్యదర్శులు, హెచ్ ఓడీల సమావేశంలో వివిధ శాఖల అధికారులు ఆయా శాఖలకు చెందిన ప్రగతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ మేరకు సీఎం వివిధ అంశాలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. గత పాలకుల నిర్లక్ష్యంతో సగటున 12 శాతం మేర అధిక వడ్డీలకు అప్పులు తెచ్చారని అన్నారు.. కొన్ని రుణాలను రీషెడ్యూలింగ్ ద్వారా మొదటి ఏడాదిలోనే రూ.512 కోట్ల మేర ఆదా చేయగలిగామని చెప్పారు.
ఈ ఏడాది మార్చి నాటికి రూ.1000 కోట్ల మేర ఆదా అవుతుందని పేర్కొన్నారు సీఎం. ఇవి కొన్ని కార్పోరేషన్లు వివిధ బ్యాంకుల నుంచి అధిక వడ్డీలకు తెచ్చిన అప్పులను పరిశీలించి… బ్యాంకులతో సంప్రదింపులు జరిపితే… ఈ మేరకు ఆదా అయిందన్నారు. హెచ్ఓడీలు జాగ్రత్తగా వ్యవహరిస్తే ప్రజా ధనం వృధా కాకుండా నిలువరించే అవకాశం ఉందని స్పష్టం చేశారు చంద్రబాబు నాయుడు. మొత్తంగా అప్పులపై రూ.7 వేల కోట్ల మేర ఆదా అవుతుందని అంచనా వేశామన్నారు. గత పాలనలో ఏపీ బ్రాండ్ పోవటం వల్ల అదనంగా వడ్డీలు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఇప్పుడు వాటన్నిటినీ రీషెడ్యూలు చేసి ప్రజాధానాన్ని కాపాడుతున్నాం అని చెప్పారు సీఎం. ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజల్లో సానుకూల దృక్పథం రావడంతో పాటు… వాళ్లకు సంతృప్తి కలిగించేలా ప్రభుత్వ శాఖలు పనిచేయాల్సిందేనని అన్నారు.
















