న్యూఢిల్లీ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దేశ రాజధానిలో బిజీగా ఉన్నారు. తన షెడ్యూల్ లో భాగంగా కేంద్ర మంత్రులను కలిశారు. ఏపీకి రావాల్సిన నిధులను మంజూరు చేయాలని కోరారు. అంతకు ముందు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ తో నారా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. రాష్ట్రంలో వ్యవసాయం, అనుబంధ రంగాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. సేంద్రీయ సాగుపై ప్రత్యేక దృష్టి సారించామని అన్నారు. 2024-25 సంవత్సరంలో సాగులో రసాయనాల వినియోగం 2.28 శాతం మేర తగ్గించామని తెలిపారు. రసాయన ఎరువుల వాడకం తగ్గించినందున PM-PRANAM ప్రొత్సాహకాలను ఇవ్వాలని కోరారు.
కొబ్బరి సాగు అభివృద్ధి చేయడానికి రూ. 200 కోట్ల మేర సాయం చేయాలని విన్నవించారు నారా చంద్రబాబు నాయుడు. కోకోనట్ ప్రాసెసింగ్ పార్క్ ఏర్పాటు, కర్ణాటక తరహాలో మోడ్రన్ టెండర్ కోకోనట్ మార్కెట్ల ఏర్పాటు, కొబ్బరి రైతులకు ఆధునాతన పద్దతులపై ట్రైనింగ్, నర్సరీల విస్తరణకు సహకరించాలని కోరారు. పర్ డ్రాప్ మోర్ క్రాప్ పథకం పెండింగ్ లో ఉన్న రూ.695 కోట్లు విడుదల చేయాలని, ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ సిస్టం కింద 2025-26 సీజన్‌లో తోతాపూరి మామిడికి కేంద్ర వాటాగా ఇవ్వాల్సిన రూ.100 కోట్ల సాయాన్ని విడుదల చేయాలని విన్నవించారు సీఎం. అంతే కాకుండా ఏపీలో మఖానా డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని, కొల్లేరు సరస్సు ప్రాంతంలో 50 వేల ఎకరాల్లో మఖానా సాగుకు అనుకూల వాతావరణం ఉన్నందున ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరారు.
