CM Chandrababu : అమరావతి : శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దేవస్థానాన్ని సమగ్రమైన మాస్టర్ ప్లాన్ తో దివ్య క్షేత్రంగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) దేవాదాయశాఖ అధికారులను ఆదేశించారు. ఏటా లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్నందున వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించే ప్రణాళికలపై దేవాదాయ, అటవీశాఖ అధికారులతో సీఎం చర్చించారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో శ్రీశైలం దేవాలయ అభివృద్ధి ప్రణాళికలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, దేవాదాయశాఖ, అటవీ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
CM Chandrababu Comments
జ్యోతిర్లింగం, శక్తి పీఠం రెండూ కలిగిన దివ్య క్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీశైలం ఆలయ సమగ్రాభివృద్ధి పై సీఎం నారా చంద్రబాబు నాయుడు చర్చించారు. తిరుమల తరహాలోనే శ్రీశైల క్షేత్రాన్ని అభివృద్ధి చేసేలా కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా వేర్వేరు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఈ క్షేత్రానికి వస్తున్న నేపథ్యంలో రద్దీకి తగ్గట్టు వారికి సౌకర్యాలు కల్పించాల్సి ఉందని ముఖ్యమంత్రి అన్నారు. దేవాలయ అభివృద్ధి కోసం 2 వేల హెక్టార్ల అటవీ భూమిని దేవాదాయశాఖకు కేటాయించేలా కేంద్ర అటవీ మంత్రిత్వశాఖకు విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు. అలాగే ఈ నెల 16 తేదీన ప్రధాని మోదీ శ్రీశైల మల్లిఖార్జున స్వామిని దర్శించు కొనేందుకు శ్రీశైలం రానున్న దృష్ట్యా ఆయనతో ఆలయ అభివృద్ధిపై చర్చించాలని సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు.
Also Read : YS Sharmila Fired on AP Govt : సర్కార్ హామీలు బారెడు అమలు మూరెడు
