CM Chandrababu : అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఇల్లు అనేది లేకుండా ఉండ కూడదని అన్నారు. ప్రతి ఒక్కరికీ ఇల్లు కట్టించి ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రకటించారు . ఇందులో భాగంగా అన్నమయ్య జిల్లా రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గం, చిన్నమండెంతో బాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో నిర్మించిన 3 లక్షల ఇళ్లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లబ్దిదారులకు వర్చువల్ విధానం ద్వారా పంపిణీ చేశారు. అదే విధంగా సొంత స్థలం ఉన్న వారికి ఇళ్లు నిర్మించు కునేందుకు అనుమతి పత్రాలను అందచేశారు. రాబోయే మార్చి నెలలోపు మిగిలిన 5.8 లక్షల ఇళ్లు పూర్తి చేయాలని ఈ సందర్భంగా సీఎం సంబంధిత అధికారులను ఆదేశించారు.
CM Chandrababu Comments
ఇదిలా ఉండగా రాయచోటి నియోజకవర్గం దేవగుడిపల్లెలో పేదల గృహ ప్రవేశ కార్యక్రమంలో స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ముందుగా లబ్ధిదారు హేమలత కుటుంబంతో కలిసి గృహ ప్రవేశం చేశారు. అనంతరం పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. గృహ ప్రవేశం సందర్భంగా హేమలత, ఆమె భర్త ఈశ్వర్‌కు నూతన వస్త్రాలు బహుకరించారు. మరో లబ్ధిదారు షేక్ ముంతాజ్ బేగం నివాసానికి సీఎం వెళ్లారు. గృహ ప్రవేశం అనంతరం నమాజ్‌లో పాల్గొన్నారు. ముంతాజ్ బేగం కుటుంబ సభ్యులకు కూడా సీఎం నూతన వస్త్రాలు అందించారు. ఈ సందర్బంగా లబ్ది పొందిన గృహ యజమానులంతా ఏపీ కూటమి సర్కార్ కు, సీఎం నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు.
Also Read : CM Chandrababu-Amit Kalyan Important Meet : సీఎం చంద్రబాబుతో అమిత్ కళ్యాణ్ భేటీ


















