హైదరాబాద్ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఇప్పుడు అన్ని రంగాలలో కీలకమైన పాత్ర పోషిస్తుందన్నారు. కృత్రిమ మేథ (AI) ప్రపంచాన్ని శాసిస్తున్న నేపథ్యంలో పాఠశాల స్థాయి నుంచి దాని బోధనకు అవసరమైన చర్యలు తక్షణమే చేపట్టాలని ఆదేశించారు. మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకునేలా ఏఐపై ఉపాధ్యాయులు, లెక్చరర్లకు స్వల్పకాలిక శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని అన్నారు. AIతో ప్రపంచ వ్యాప్తంగా వచ్చే మార్పులను తెలుసుకొని దాని ద్వారా వచ్చే అవకాశాలు మన విద్యార్థులే అందిపుచ్చుకునేలా మన సన్నద్ధత ఉండాలని సీఎం అభిప్రాయపడ్డారు. సాంకేతిక విద్యా విధానంలో అందుకు అనుగుణమైన మార్పులను తీసుకురావాలని సీఎం పేర్కొన్నారు.
2026-2027 విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ అమలు చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. బ్రేక్ ఫాస్ట్ అందజేతకు సంబంధించి అధికారులు, హరేకృ ష్ణమిషన్ ప్రతినిధులకు సీఎం పలు సూచనలు చేశారు. బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు ప్రతి విద్యార్థికి పాలు అందజేయాలని.. ఇందుకు పాలను విజయా డెయిరీ నుంచి సేకరించాలని సీఎం ఆదేశించారు. విద్యార్థులకు ఎన్ని క్యాలరీలు అందజేస్తున్నామనేది తెలుసుకునేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని ముఖ్యమంత్రి సూచించారు. పాఠశాల విద్యార్థులకు స్కూల్ యూనిఫాం, పుస్తకాలతో పాటు ఈ ఏడాది నుంచి కిట్ అందజేయాలని అందులో స్కూల్ బ్యాగ్, పెన్నులు, పెన్సిళ్లు, షార్పనర్లు, రంగుల పెన్సిళ్లు, జామెట్రీ బాక్సులు, డిక్షనరీ, బూట్లు, సాక్సులు ఉండాలని సీఎం తెలిపారు. ఇందుకు సంబంధించిన మొత్తాన్ని బడ్జెట్‌లో పొందుపర్చేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు.
