తెలంగాణ‌లో ప్ర‌త్యేకంగా మెడిక‌ల్ టూరిజం పాల‌సీ

తీసుకు వ‌చ్చామ‌ని తెలిపిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి

hellotelugu-CM

హైద‌రాబాద్ : దేశంలోని వైద్య రంగంలో 50 శాతానికి పైగా సేవలు తెలంగాణ నుంచి అందించాలన్న లక్ష్యంగా రాష్ట్రంలోని ఆసుపత్రులు అభివృద్ధి చెందాలని సీఎం ఎ. రేవంత్ రెడ్డి కోరారు. అందుకు అవసరమైన విధాన పరమైన నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. వైద్య రంగం అభివృద్ధికి ప్రభుత్వం ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో అపొలో హాస్పిట‌ట‌ల్ ను రాష్ట్ర వైద్య , ఆరోగ్య శాఖ మంత్రి దామోద‌ర రాజ న‌ర‌సింహ‌తో క‌లిసి ప్రారంభించారు సీఎం. ఈ సందర్భంగా అపోలో వ్యవస్థాపకులు, చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డితో పాటు యాజమాన్యాన్ని ముఖ్యమంత్రి అభినందించారు.

మెడికల్ టూరిజం కోసం మొన్నటి వరకు ఒక పాలసీ లేదన్నారు. తమ ప్రభుత్వం ఒక పాలసీ తీసుకొచ్చిందని చెప్పారు సీఎం. వైద్య రంగం అభివృద్ధికి అన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నాం అన్నారు. మెడిక‌ల్ టూరిజం మరింతగా వృద్ధి చెందాలని పశ్చిమాసియా దేశాలతో నేరుగా విమాన సర్వీసుల కోసం ప్రధానమంత్రి మోదీని, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహ‌న్ నాయుడిని కోర‌డం జ‌రిగింద‌ని చెప్పారు సీఎం. దేశంలో 50 శాతంపైగా వైద్య సౌకర్యాలు తెలంగాణ నుంచి అందాలన్న లక్ష్యంతో ఎలాంటి లోపాలు లేకుండా విధాన పరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాం అన్నారు. ఇక్కడ పెట్టుబడులకు ప్రభుత్వం పూర్తి భద్రత కల్పిస్తుంది అని హామీ ఇచ్చారు.

1967 లో ఇందిరాగాంధీ ఇక్కడ ఐడీపీఎల్‌ను ఏర్పాటు చేయడంతో ఆ తర్వాత క్రమంలో హైదరాబాద్ ఫార్మా హబ్‌గా అవతరించిందని తెలిపారు. ఆరోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఫార్మా హబ్‌గా మారిందన్నారు. ఇప్పుడు దేశం నుంచి ఎగుమతి అవుతున్న బల్క్ డ్రగ్స్‌లో 40 శాతం హైదరాబాద్ నుంచి అవుతున్నాయని గుర్తు చేశారు .46 ఏళ్ల కిందట చెన్నైలో 150 పడకలతో ప్రారంభమైన అపోలో హాస్పిటల్స్ తన ప్రయాణంలో 76 వ బ్రాంచ్‌ను ప్రారంభిస్తున్నారని ప్ర‌శంసించారు. అపోలో హాస్పిటల్స్ దేశానికి ఒక రోల్ మాడల్‌గా నిలిచిందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఒక బ్రాండ్. అపోలో అనే మాట సహాయం ఆశిస్తున్న కోట్లాది మంది ప్రజలకు మనసుల్లో నిలిచిందన్నారు.

Exit mobile version